నేనొకడిని ఉన్నానని గుర్తుందా..?

ZP chairperson boya nagaraju fired on officials - Sakshi

పంచాయతీరాజ్‌ ఎస్‌ఈపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

స్థాయీ సంఘం సమావేశాల్లో అధికారుల తీరుపై విమర్శలు

అధికారుల పర్సెంటేజీ వ్యవహారంపై ఆరోపణలు

అనంతపురం సిటీ: ‘‘అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వమంటే ఇవ్వరు... జెడ్పీ చైర్మన్‌గా నా దృష్టికి తీసుకురాకుండానే ఓ అధికారి జెడ్పీ ఆవరణలోని కార్యాలయాన్ని తనకు నచ్చిన చోటుకు మార్చుకుంటాడు... ఇక అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయని ఫిర్యాదులొస్తే పట్టించుకోరు... అసలు మీరు  ఏమనుకుంటున్నారు...జెడ్పీ చైర్మన్‌గా నేనొకడిని ఉన్నానని మీకు గుర్తుందా..?’’ అంటూ చైర్మన్‌ బోయ నాగరాజు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం జెడ్పీలోని సమావేశ భవనంలో  జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. పద్ధతులు  మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

పలు అంశాలపై చర్చ
స్థాయీ సంఘం సమావేశాలకు చైర్మన్‌ బోయ నాగరాజుతో పాటు మూడు అంశాలపై అధ్యక్ష స్థానంలో లక్ష్మీనారాయణరెడ్డి కొనసాగారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జల వనరుల శాఖలకు సంబంధించిన ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం, వేసవిలో సురక్షిత నీటిని అందించే విషయంలో పలు తీర్మానాలు చేశారు. తాజాగా రూ.9 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌ తెలిపారు. త్వరలో ఈ పనులకు సంబంధించిన టెండర్లకు పిలుస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇంకా రూ.12 కోట్లు నిధులు అడిగామన్నారు. రహదారుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదన్న విషయం వాస్తవమేనని ఎస్‌ఈ సుబ్బరావు అన్నారు. గతేడాది మిగులు నిధులను ఈ ఏడాదికి వినియోగించుకునే విషయాన్ని కలెక్టర్‌ని అడిగామన్నారు. అనుమతి రాగానే సర్దుబాట్లు చేస్తామన్నారు. స్థాయీ సంఘం సమావేశాల్లో సీఈఓ శోభాస్వరూపారాణి, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, పలువురు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.   

పర్సెంటేజీల పట్టికలను ఏర్పాటు చేయండి సార్‌..
‘‘పంచాయతీరాజ్‌ శాఖలో ప్రతిపనికీ అధికారులు పర్సెంటేజీలు అడుగుతున్నారు..ఇకపై మీ కార్యాలయాల్లో ఏయే అధికారికి, ఏఏ పనికి ఎంత వాటా ఇవ్వాలో పట్టికలో రాసి ఉంచండి సార్‌...అప్పుడు మాకూ ఇబ్బంది ఉండదు’’ అంటూ అధికార పార్టీకి చెందిన కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ రవూఫ్‌ అధికారుల తీరును తూర్పారబట్టారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేస్తే కనీసం రూ.10 వేలు కూడా మిగలడం లేదన్నారు. ఇందులో కూడా ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా వాటాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రహదారులు, అంగన్‌ వాడీ భవనాలు, గిడ్డంగుల నిర్మాణాల్లో జరుగుతున్న, జరిగిన అవినీతి గురించి కనీస విచారణ జరిపేందుకు కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు జంకడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీంతో అధికారుల మాట నోట రాలేదు. పైపెచ్చు సర్దుకుంటామని చెప్పి తప్పుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top