బీజేపీ మోసంలో బాబు భాగస్వామి

YSRCP MPs comments on CM Chandrababu - Sakshi

     వైఎస్సార్‌ సీపీ ఎంపీల మండిపాటు 

     సీఎం శిక్ష అనుభవించక తప్పదు 

     ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా ప్రజలు క్షమించరు 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి, ప్రత్యేక హోదా కోసం ఏనాడూ పోరాడని సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిన మోసంలో చంద్రబాబు కూడా ప్రధాన భాగస్వామి అని, ఆయన శిక్ష అనుభవించక తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విజయ్‌చౌక్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆమరణ నిరాహర దీక్షకు దిగి ఆసుపత్రిపాలైన మిథున్‌రెడ్డి ఇంకా చికిత్స పొందుతుండడంతో రాష్ట్రపతిని కలవలేకపోయారని తెలిపారు. 

రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు  
‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ మా పదవులకు రాజీనామాలు చేసి, ఆమరణ దీక్షకు దిగామని రాష్ట్రపతికి తెలియజేశాం. హోదాతోపాటు చట్టంలో పేర్కొన్న ఇతర హామీల అమలుపై కేంద్రం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని వివరించాం. మా విజ్ఞప్తులపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. రాజ్యాంగపరంగా తాను చేయగలిగింది చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్‌ తగ్గిపోతోందని గమనించిన చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి నాలుగేళ్లపాటు ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని హోదా అడుగుతున్నారు. చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా ప్రజలు ఆయన్ని క్షమించరు.

రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసంలో చంద్రబాబు కూడా భాగస్వామి. దీనికి ఆయన శిక్ష అనుభవించక తప్పదు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోంది. హోదాపై వైఎస్‌ జగన్‌ ప్రజల్లో కల్పించిన అవగాహన వల్లే రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మోదీకి వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి ఇచ్చిన హామీ అమలు చేయాలి. లేదంటే కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మిగిలిపోతుంది’’  అని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు.

ఎన్నికల్లో గెలిచి ప్రజావాణి వినిపిస్తాం
‘‘ఏపీకి కేంద్రం చేసిన మోసానికి నిరసనగా వేరే దారిలేక రాజీనామాలు చేశాం. ఇక ప్రజల్లోకి వెళ్తాం. మళ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేస్తాం. రాజీనామాలపై స్పీకర్‌ త్వరగానే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేకపోతే మళ్లీ అందరం కలిసి మరోసారి స్పీకర్‌ను కలుస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి జోక్యం అత్యవసరం. రాష్ట్రపతి కల్పించుకొని రాష్ట్రానికి న్యాయం చేయాలి’’  అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

చంద్రబాబు అసమర్థత వల్లే హోదా రాలేదు  
‘‘ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు అసమర్థతే కారణం. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రూ.90 వేల కోట్లు అప్పులు చేస్తే.. 13 జిల్లాల ఏపీలో గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల అప్పులు చేసింది. హోదా ఉంటే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రం అభివృద్ధి చెందేది. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదు. ప్రత్యేక హోదా సాధించేదాకా మా పోరాటం ఆగదు’’  అని ఎంపీ వరప్రసాదరావు  స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top