
సాక్షి, విజయవాడ : 2014లో చంద్రబాబు 630 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే(ఓపీఎస్) అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలకు మంగళం పాడారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి బాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నిలు సమీపిస్తోన్న వేళ నిరుద్యోగభృతి అంటూ హడావుడి చేస్తున్నారు.. ఇది కూడా బోగస్‌ని గోపాల్ రెడ్డి మండిపడ్డారు.
బాబు ఉదయం లేచింది మొదలు అన్ని అబద్ధాలే చెబుతారంటూ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదంటూ విమర్శించారు. రైన్ గన్స్ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారంటూ మండి పడ్డారు. ఇకనైనా చంద్రబాబు అబద్ధాలు మాని.. పాలనపై దృష్టి పెట్టకపోతే ప్రజలే బాబు పాలనకు చరమగీతం పాడతారంటూ హెచ్చరించారు.