హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా?: కోన రఘుపతి

YSRCP MLA Kona Raghupathi Fires on CM Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో నాలుగోసారి తీర్మానం ప్రవేశపెట్టి చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు పదవీకాలం అంతా అయిపోయాక అసెంబ్లీలో తీర్మానం ఎందుకు అని ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లగా ఏపీ ప్రజలను చంద్రబాబు అన్నిరకాలుగా నిరాశకు గురిచేస్తూ వచ్చారని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా? అని కోన రఘుపతి ప్రశ్నించారు. ప్యాకేజీ పేరిట ప్రత్యేక హోదాను ఆయన పక్కన పెట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొదట కేంద్రం బ్రహ్మాండమైన పాకేజీ ఇస్తుందని ఊరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడుదామంటూ యూ టర్న్ తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు నాలుగోసారి తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంచేందుకు ప్రయత్నిస్తామంటూ విద్యార్థులను బాబు మోసగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి చంద్రబాబు.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రిమోట్ కంట్రోల్ నాలుగేళ్లుగా బీజేపి ఆఫీస్‌లో ఉందని,  బీజేపీ ఆఫీస్‌లో రిమోట్ కంట్రోల్ ఉండటం వల్లే.. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు రిమోట్ కంట్రోల్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై పసలేని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top