‘సూరీ.. నీచ రాజకీయం మానుకో’

YSRCP MLA Kethireddy Venkatarami Reddy Slams Varadapuram Suri Over Anantapuram Politics  - Sakshi

సాక్షి, ధర్మవరం టౌన్‌ : ‘సూరీ... వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేస్తున్న అనైతిక ఆరోపణలపై నిప్పులు చెరిగారు. మంగళవారం ధర్మవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. వేసిన రోడ్లకు, కాల్వలకు మళ్లీ మళ్లీ బిల్లులు చేసుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.  

వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నాం 
పోలీసులను ఫ్లెక్సీలకు కాపలాదార్లుగా పెట్టిన నీచమైన సంస్కృతి వరదాపురం సూరి హయాంలో జరిగిందన్నారు. టీడీపీ హయాం మొత్తం అమాయక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, హోదా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వ్యవస్థలను ప్రక్షాళన చేసి మీరు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. 

రాళ్లు విసరడం సూరీ కుట్రే 
ఇటీవల ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో 60 అడుగుల మాస్టర్‌ప్లాన్‌ రోడ్డును కొంతమంది ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారన్నారు. ఈ విషయమై ‘గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం’లో ప్రజలు తన దృష్టికి తీసుకు రావడంతో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయబద్ధంగా ఆక్రమణలను అధికారులు తొలగిస్తుంటే సూరీ కుట్రపన్ని రాళ్లు విసిరించారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బత్తలపల్లిలో హత్య కేసులో సుపారీ ఇచ్చారన్న ఆరోపణలున్న ఈశ్వరయ్య అనే వ్యక్తికి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయించారని మండిపడ్డారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన విషయంపై విచారణ జరుగుతోందన్నారు. 

నేరచరితులపై రౌడీషీట్‌ ఎత్తివేయిస్తారా? 
తెలుగుదేశం పాలనలో సూరి చేసిన ఒకే ఒక్క పని రౌడీషీట్‌ ఎత్తివేయించుకోవడమేనని కేతిరెడ్డి విరుచుకుపడ్డారు. నేరచరితులపై రౌడీషీట్‌ ఎత్తివేయించి వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన వరదాపురం సూరీతో పాటు వార్తను ప్రచురించిన పత్రికా యాజమాన్యాలపైన పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. నిరాధార ఆరోపణలు మాని పట్టణ అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో తగిన విధంగా బుద్ధి చెబుతామని హితవు పలికారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన పాలనను అందించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఆశయంతో తాను పని చేస్తున్నానన్నారు. అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పారదర్శక పాలనకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top