ఆ వ్యాఖ్యలను పవన్‌ వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే అమర్నాథ్‌

YSRCP MLA Gudivada Amarnath Fires On Pawan Kalyan - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం​: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తీరుపై శనివారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి పవన్‌కల్యాణ్‌ ఓర్వలేకపోతున్నారని అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు. రియల్ హీరో వైఎస్‌ జగన్‌ను చూసి.. సినీ హీరో తట్టుకోలేకపోతున్నారన్నారు. పవన్‌కల్యాణ్‌  రాజకీయాలను సినిమాలుగా భావిస్తున్నారని విమర్శించారు. ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఒక్కసారైనా గాజువాక వచ్చారా.. అంటూ పవన్‌కల్యాణ్‌ను నిలదీశారు. అమరావతిలో అవినీతి కనబడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్‌పై నిప్పులు చెరిగారు.

అవినీతి జరిగితే.. కళ్లు మూసుకుని కూర్చోమంటారా..
అమరావతిలో ప్రతి అడుగుకి అవినీతి కనబడిందని.. ఐదేళ్లలో ఏమయ్యారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగితే.. కళ్లు మూసుకుని కూర్చోమంటారా అని అన్నారు. గ్రామ వలంటీర్లను కోరియర్‌ బోయ్స్‌,కోరియర్‌ గర్ల్స్‌గా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను పవన్‌ వెనక్కి తీసుకోవాలన్నారు .గ్రామ వలంటీర్‌ వ్యవస్థ ద్వారా సొంత గ్రామానికి, మాతృ భూమికి సేవ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. నేడు పవన్ తీరు చూస్తే పెయిడ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ నుండి ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా అవతారం ఎత్తినట్లుగా కనిపిస్తోందన్నారు. వందరోజుల వేడుకలు సినిమాలకి తప్ప.. రాజకీయ నేతలకు, ప్రభుత్వానికి కాదన్నారు. వందరోజుల పాలన మా బాధ్యత ను గుర్తు చేస్తుందన్నారు. పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. రాష్ట్ర్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ తపన అని పేర్కొన్నారు. ప్రజల ఆశ్వీరాదంతోనే వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top