ఆరోపణలు నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా

YSRCP MLA Candidate Duddukunta Sridhar Fires On Palle Raghunath Reddy - Sakshi

సాక్షి, పుట్టపర్తి టౌన్‌ : పుట్టపర్తి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పల్లె రఘునాథరెడ్డి మతిభ్రమించి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా..లేదంటే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన పేపర్‌క్లిప్పింగ్‌ తీసుకొని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

చంద్రబాబు అపద్ధాలు చెప్పడంలో దిట్ట అని, అవగాహన లేకుండా తాను జగన్‌మోహన్‌రెడ్డి బినామీ అని, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌నాయుడు తన వల్లే ఉద్యోగం పోయిందని ఆరోపణలు చేయడంలో వాస్తవం లేదన్నారు.  దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. 1997లో కక్షసాధింపుగా అతన్ని తొలగించాలని చూస్తే భాస్కర్‌నాయుడును తానే కాపాడానని అన్నారు.
 
పుట్టపర్తి అభివృద్ధి పేరిట దోపిడీ 
పుట్టపర్తి అభివృద్ధి పేరిటరూ. 200 కోట్లు దోచుకున్న విషయం మీది అని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి రాగానే పిల్ల కాలవల జీవో రద్దు చేసి, 2013 భూసేకరణచట్టం ప్రకారం పెద్దకమ్మవారిపల్లి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా అనంతపురం రైతులకు సాగు నీరు ఇవ్వకుండా కుప్పానికి హంద్రీనీవా కాలువ ద్వారా తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా కోడ్‌కు విరుద్ధంగా అర్ధరాత్రి నాయకులను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పల్లెకే చెల్లిందన్నారు.

అధికారం ఉన్న ఐదేళ్లూ నిద్రపోయి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.3200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేశానని చెప్పి, ఓటర్లను మళ్లీ మోసం చేస్తున్నారన్నారు.  పల్లె గిమ్మిక్కులకు మోసం పోయే పరిస్థితులో ప్రజలు లేరన్నారు.  కార్యక్రమయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్‌ మాధవరెడ్డి, గంగాద్రి, అవుటాల రమణారెడ్డి, ఏవీ రమణానెడ్డి, తిప్పన్న, శివప్ప, బిల్డర్‌శివ, జ్యోతికేశవ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top