అంతా పథకం ప్రకారమే..

YSRCP Leaders Slams TDP Government about Attack on YS Jagan - Sakshi

జగన్‌ను అంతం చేసే కుట్ర దీనివెనకుంది

ఇది చిన్న వ్యవహారం ఎంతమాత్రం కాదు..

హత్యాయత్నాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా డీజీపీ ఎలా చెబుతారు?

వైఎస్సార్‌సీపీ నేతలు మేకపాటి, ధర్మాన ఆగ్రహం

టీడీపీ ఎంపీ నాని జగన్‌ను కైమా కింద ముక్కలు చేస్తామంటున్నారు.. ఇది ఎంత దారుణమైన మాట

నిష్పాక్షిక విచారణకు సిద్ధం కావాలని చంద్రబాబుకు సవాలు

థర్డ్‌ పార్టీతో లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఎంతమాత్రం చిన్నది కానే కాదని, ఆయన్ను అంతమొందించడానికి ఒక పథకం ప్రకారం పక్కాగా చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం దీనిని చిన్నగా చేసి చూపుతోందని అభ్యంతరం తెలిపారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ హత్యాయత్నంపై నిష్పాక్షిక విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. మేకపాటి మాట్లాడుతూ జగన్‌ తనపై హత్యాయత్నం తానే చేయించుకున్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ఇక టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏకంగా తాము కావాలంటే జగన్‌ను కైమా కింద ముక్కలు చేస్తామంటున్నారని, ఇదెంత దారుణమైన మాట అని తప్పుపట్టారు.

వాస్తవానికి జగన్‌పై జరిగిన దాడి చిన్నది కాదని, ఆ కత్తి ఎంతో పదునుగా ఉంటుందని, అది కనుక తగలరాని చోట తగిలితే ప్రాణాపాయం కలిగేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు చాలా చిన్న కుటుంబానికి చెందినవాడని, అతనికి అంత తెగింపు ఉండదని, ఎవరో ప్రేరేపించి ఉంటారు కాబట్టే అన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. హత్యాయత్నాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా డీజీపీ ఎలా చెబుతారని, టీడీపీ ఎంపీలు అంత దారుణంగా ఎలా మాట్లాడతారని మేకపాటి దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన్ను అంతం చేసేందుకు పథకం ప్రకారం చేసిందంటూ.. దీన్ని చిన్నదిగా చేసి చూపడం దారుణమన్నారు. ఈ ఘటనకు ఇతరులను బాధ్యులుగా చేయడం, వారిపైనే నిందలు వేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రతిపక్ష నేతను పరామర్శించిన వారినీ విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని ప్రజలంతా గమనించాలని, ఇలాంటి పోకడలను సమర్థిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని అనేక సమస్యలొస్తాయని చెప్పారు.

థర్డ్‌పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయించాలి..
ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంలో తననే ముద్దాయిగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు అంటున్నారని, అయితే దీన్నుంచి బయటపడాలంటే.. రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేని ఏజెన్సీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికను ప్రజల ముందుంచితే సరిపోతుందని ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఈ ఘటనతో సీఎంకు సంబంధం లేదని చెప్పడం నిజమే అయితే అది దర్యాప్తులో తేలుతుంది కదా? మీకెందుకంత కలవరం? అని ప్రశ్నించారు. థర్డ్‌ పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయిస్తే అన్నీ తేటతెల్లమవుతాయన్నారు. డీజీపీ ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయం చెప్పారని, కానీ సీఎం పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌ను) ఏర్పాటు చేస్తానన్నారని, డీజీపీ అభిప్రాయం చెప్పాక దానికి భిన్నంగా సిట్‌ నివేదికిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అంటే దాదాపుగా మీ(సీఎం) హోదా కలిగినవారని, అలాంటివ్యక్తిపై హత్యాయత్నం జరిగితే ఇలా వ్యవహరిస్తారా? అని విస్మయం వెలిబుచ్చారు. ఘటన జరిగిన గంటలోపే డీజీపీ తన అభిప్రాయం ఎలా చెబుతారు.. ఆయన అసలు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. డీజీపీ చెప్పిందే నిజమని ప్రజల్ని నమ్మించేయత్నం పథకం ప్రకారం జరుగుతోందన్నారు.

గవర్నర్‌ను తప్పుపట్టడమేంటి?
గవర్నర్‌ రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి అని, ఈ హత్యాయత్నంపై డీజీపీతో ఆయన మాట్లాడటాన్ని ఎలా తప్పుపడతారు? వాస్తవానికి రాష్ట్రంలో గవర్నర్‌ పేరుమీదుగానే కదా పాలన జరిగేది? అని ధర్మాన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి ఎవరు? ప్రభుత్వ నిర్ణయాలు ఎవరిపేరిట వెలువడతాయి? అసలు మంత్రిమండలిని నియమించేది ఎవరని నిలదీశారు. గవర్నర్‌ వ్యవస్థను కించపరుస్తూ ఏకంగా కలెక్టర్ల సదస్సులోనే మాట్లాడారని, ఒక ముఖ్యమంత్రిగా అలా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. ఎవరి అజమాయిషీలో పనిచేస్తున్నారో ఆయననే అవమానపరుస్తూ మాట్లాడ్డం చూస్తే చంద్రబాబు గతి తప్పుతున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీలో గంభీరంగా మాట్లాడారని, దేశంలో రాజ్యాంగవ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోయాయని ప్రసంగించారని, కానీ అక్కడివారికి ఇక్కడ(ఏపీలో) ఏం జరుగుతోందో తెలియదని ధర్మాన అన్నారు.

ఏకంగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేగాక వారిని అనర్హులుగా చేయకుండా స్పీకర్‌పై ఒత్తిడి చేసింది నిజం కాదా? అలాంటి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతోందని మాట్లాడతారా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్నదానికి భిన్నంగా ఢిల్లీ వీధుల్లో గగ్గోలు పెడుతున్నారని, మీపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరపకూడదా? మీరేమైనా అతీతులా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు కనుక విచారణకు ఆహ్వానిస్తారనుకున్నామని, తనను తాను రక్షించుకోవడానికి మాట్లాడారేతప్ప మరేమీ లేదన్నారు. అందుకే తాము థర్డ్‌పార్టీ విచారణనుగానీ, సీబీఐ దర్యాప్తునుగానీ కోరుతున్నామన్నారు. జగన్‌ తమ దయాదాక్షిణ్యాలమీదనే బతుకుతున్నాడని, తాము అనుకుంటే కైమా చేసేవాళ్లమన్న టీడీపీ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top