‘టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు’

YSRCP Leaders Fires On TDP Leaders - Sakshi

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ సీపీ నేతల ధర్నా

ఫ్లెక్సీల తొలగింపుపై కమిషనర్‌ నిలదీత

శ్రీకాళహస్తి: అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతితో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్‌ సి బ్బంది గురువారం తొలగించారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్‌ సీపీ నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్‌ బాలాజీ ప్రసాద్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని మూడు గంటల పాటు ధర్నా చేశారు. ఆ సమయంలో మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు కార్యాలయంలో లేరు. ధర్నా విషయాన్ని మున్సిపల్‌ సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఆయన,  పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఎస్‌ఐ శివయ్య  పోలీస్‌ బలగాలతో మున్సిప ల్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా విరమించా లని వైఎస్సార్‌ సీపీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, ఎవరికీ ఆటంకం కలిగించలేదని, కమిషనర్‌ వచ్చి, తమతో మాట్లాడి న్యాయం చేస్తే వెళతామని అన్నారు.

అనంతరం సీఐ సత్యనారాయణ మరింత మంది పోలీస్‌ బలగాలతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ నేతలు మాట్లాడుతూ తమపై కేసులు పెట్టి, అరెస్టు చేసినా తాము కమిషనర్‌ వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించే ప్రసక్తేలేదని భీష్మించారు. రెండు గంటల పాటు ధర్నా జరిగినా కమిషనర్‌ రాకపోవడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక మిద్దెల హరి, కొట్టెడి మధుశేఖర్‌ అస్వస్థతకు గురై, అక్కడే పడుకున్నారు. పరిస్థితి విషమించడంతో సీఐ సత్యనారాయణ ఈ విషయమై డీఎస్పీ వెంకటకిషోర్‌కు సమాచారం అందజేశారు. దీంతో డీఎస్పీ మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి, మున్సిపల్‌ కార్యాలయాలనికి వెళ్లాలని సూచించారు. దీంతో ము న్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చిం చారు.

ఈ సందర్భంగా  నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్‌ బాలాజీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తాము చలానా కట్టి, మున్సి పల్‌ అధికారుల అనుమతితోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గత నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో టీటీడీ నేతలు అనుమతి లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌ వారికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి పోయారు. కొంత సేపటి తరువాత కమిషనర్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ తనని క్షమించాలని, రాజకీయ ఒత్తిళ్లతోనే అనుమతి పొందినప్పటికీ మీ ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు. అనుమతి లేని ఫ్లెక్సీలు మాత్రం పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకు చెందిన వాటిని తొలగిస్తామన్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఎత్తిరాజులు, షేక్‌ సిరాజ్‌బాషా, అమాన్, జయశ్యామ్‌రాయల్, మహిధర్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top