‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్‌ జాగ్రత్త..’

YSRCP Leader Ambati Rambabu Critics Chandrababu Over Flood Politics - Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని అన్నారు. నాగార్జునసాగర్ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. బాబు ధోరణి చూస్తుంటే వరదలతోనూ సానుభూతి పొందాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

‘చేయి నొప్పి వల్లే ఆయన హైదరాబాద్‌ వెళ్లినట్టు చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్లు లేరా. చేయినొప్పికే అక్కడిదాకా వెళ్లాలా. బాబు హైదరాబాద్ వెళితే మరి లోకేష్ ఎక్కడికి వెళ్లారు. నదీగర్భంలో ఉంటూ  ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేపర్లలో రాయించుకుంటున్నారు. కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా. మరేమైంది. ఎన్ని కూల్చేశారు. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారు. 

అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకి అంటూన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం నేరం. అక్కడ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. ఆయనా అదే చేశారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్. విజయవాడ నడిబొడ్డున దేవాలయాలను చంద్రబాబు కూలగొట్టించినపుడు బీజేపీ నేత మాణిక్యాలరావు ఏమయ్యారు. సదావర్తి భూములను అన్యాయంగా వేలం పాట వేస్తే మాణిక్యాలరావు గుడ్లగూబలా చూస్తూ ఉండిపోయారు. పచ్చ రక్తంతో బీజేపీ తన సహజత్వం కోల్పోతుంది. ఆంద్రప్రదేశ్‌లో కమల వనం కాస్తా పచ్చ వనంగా మారుతుంది. బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు వాళ్లంతా తిరిగి చంద్రబాబు పక్కనే చేరతారు.’అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top