రాజన్న జ్ఞాపకాలు పదిలం...

YSR schemes in Congress Dharna at balkonda - Sakshi

కాంగ్రెస్‌ ధర్నాలో వైఎస్సార్‌ పథకాల ప్రస్తావన

వైఎస్‌ను కొనియాడిన కాంగ్రెస్‌ నేతలు

మోర్తాడ్‌(బాల్కొండ): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ, రైతు ప్రయోజన పథకాలను కాంగ్రెస్‌ నేతలు మననం చేసుకున్నారు. వైఎస్‌ ఉండి ఉంటే రైతులు ఇంత లోతు కష్టాల్లోకి కూరుకుపోయేవారు కాదని ఆయన లేని లోటు పూడ్చలేనిదని కాంగ్రెస్‌ నాయకులు కొనియాడారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరల కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సు ఆద్యంతం వైఎస్‌ జ్ఞాపకాలతో కొనసాగింది.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులు అమలు జరిగిన తీరును నాయకులు రైతులకు వివరించారు. పసుపు పంటకు మార్కెట్‌లో ధర దారుణంగా తగ్గిపోతే మార్కెట్‌ ఇన్వెన్షన్‌ పథకంను అమలు చేసి వ్యాపారులు దిగివచ్చి పసుపు పంటకు భారీగా ధర చెల్లించేలా చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందని నేతలు గుర్తు చేశారు.

2008లో మార్కెట్‌ ఇన్వెన్షన్‌ పథకం అమలు వల్ల పసుపు పంటను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో క్వింటాలుకు రూ.4,800 ధర చెల్లించి కొనుగోలు చేయడంతో వ్యాపారులు దిగివచ్చి ధరను అమాంతం పెంచారు. క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ.16వేల ధర పలకడానికి వైఎస్‌ అమలు చేసిన మార్కెట్‌ ఇన్వెన్షన్‌ పథకం ప్రధానం అని నాయకులు పేర్కొనడం విశేషం. 2008లోనే పసుపునకు రూ.4,800 ధరను మార్క్‌ఫెడ్‌ కల్పించగా 2018లో ధర రూ.4వేలకు పలకడంపై నాయకులు ప్రశ్నించారు. వైఎస్‌ ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని నాయకులు గుర్తు చేశారు.

ఎర్రజొన్నల కొనుగోలు కోసం 150వ నంబరు జీవోను జారీ చేసి రూ.35 కోట్ల నిధులను విడుదల చేసిన ఘనత వైఎస్‌కు దక్కుతుందని నాయకులు అన్నారు. అంతేకాక, గోదావరి నదీ జలాల వినియోగం కోసం ఎన్నో ఎత్తిపోతల పథకాలను అమలు చేసి రైతు బాంధవుడిగా అందరి మనసుల్లో గొప్ప స్థానం సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ అని నాయకులు వివరించారు. గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, లక్ష్మి కాలువ కోసం ప్రత్యేక ఎత్తిపోతల పథకాలను అమలు చేసిన వైఎస్‌ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారని నాయకులు వివరించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కిసాన్‌ఖేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొదండరెడ్డి తదితరులు తమ ప్రసంగాల్లో వైఎస్‌ అమలు చేసిన ప్రజా ప్రయోజన పథకాల గురించి క్షుణ్నంగా వివరించి సభను ఆకట్టుకున్నారు.

► నకిలీ విత్తన ముఠాలకు మూలం సీఎం ఫాంహౌసే
► మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ

బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌
మోర్తాడ్‌ (బాల్కొండ): రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారానికి మూలం సీఎం ఫాంహౌస్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిల నివాసమే అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలోని నకిలీ విత్తనాల ముఠాలకు అధికార పార్టీకి ఉన్న అనుబంధానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సీఎం, వ్యవసాయ మంత్రి ఇందుకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దలతో లింకులు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతోందన్నారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల పంట రుణం ఏక కాలంలో మాఫీ చేయడానికి టీపీసీసీ మేనిఫెస్టో సిద్ధం చేస్తుందని వివరించారు. సదస్సులో మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్, కిసాన్‌ఖేత్‌ రాష్ట్ర చైర్మన్‌ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top