రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి: వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Campaign At Anakapalli - Sakshi

చంద్రబాబు, లోకేష్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేశారు

కో ఆపరేటివ్‌ డెయిరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు

3 లక్షలు విలువ చేయని ఫ్లాట్లను.. 6 లక్షలకు అమ్ముతున్నారు

అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌

సాక్షి, అనకాపల్లి : ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. విశాఖ డెయిరీ ఒక కుటుంబానికి చెందినదిగా మారిపోయింది. విశాఖ, హెరిటేజ్‌ డెయిరీలు రైతును పీల్చిపిప్పి చేస్తున్నాయి. కో ఆపరేటివ్‌ డెయిరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చిత్తూరు డెయిరీతో సహా అన్నింటిని మూసివేయించారు. ఇక చంద్రన్న కానుకలో ఇచ్చే బెల్లాన్ని అనకాపల్లి నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి తెప్పించారు. సత్యనారాయణపురంలో అవినీతి ఫ్లాట్లు కడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. మూడు లక్షలు విలువ చేయని ఫ్లాట్లను.. రూ.6 లక్షలకు అమ్ముతున్నారు. ఈ 6 లక్షల్లో రూ.3 లక్షలను పేదల పేరుతో అప్పుగా రాసుకుంటారట. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పేదల ఇళ్లపై ఉన‍్న అప్పులను మాఫీ చేస్తాం. అలాగే తొలి శాసన సభలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం. చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు.. అందరూ అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేశారు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వెంకట సత్యవతిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నా సుధీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలను చూశాను. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అనుభవిస్తున్న​ బాధలను విన్నాను. వారందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరికీ అండగా నేనున్నాను. రైతులను వారి వేలితో వాళ్ల కంట్లోనే పొడిచే విధంగా రైతులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పాడిరైతులు, విశాఖ డెయిరీ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెల్లం రైతులకు కనీసం గిట్టుబాటు ధర కుడాలేదు. తుమ్మపాల డెయిరీని తెరిపిస్తామని నాలుగేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. విశాఖ డెయిరీ, హెరిటేజ్ రెండూ కలిసి రైతులను దోచుకుంటున్నారు. రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మోసం చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్‌లోనే రూ.1150 కోట్లు వారికోసం కేటాయిస్తాం.

పొదుపు సంఘాలకు రుణమాఫీ చేయ్యలేదు. డ్వాక్రా మహిళలను సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని చంద్రబాబు పూర్తిగా ఎత్తివేశారు. మహిళలకు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి దోచుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజన్న అశాయాలను నెరవేరుస్తూ.. సున్నా వడ్డీ రుణాలు అందిస్తాం. పసుపు కుంకుమ పేరుతో ఎన్నికల వేళ మరోసారి మోసం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదలకు ఏవిధంగా మేలు జరుగుతుందో.. పార్టీ మ్యానిఫెస్టోలో వివరించాము. టీడీపీలా తమది పేజీలకొద్ది అబద్ధాల పుస్తకం కాదు.. కేవలం రెండే పేజీల రూపంలో ప్రజలకు అర్థమైయ్యే విధంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళికను రూపొందించాం. ఐదేళ్ల పాలన ముగిసేలోపు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినట్లు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, మద్యపాన నిషేదం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక హామీలను విస్మరించారు.’’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top