ఎన్నికలకు సర్వం సిద్ధంకండి : వైఎస్‌ జగన్‌

YS Jagan Holds Committee Meeting In Vizag - Sakshi

విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

సాక్షి, విశాఖపట్నం: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్న జననేత పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణపై నియోజకవర్గ సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు దిశానిర్దేశం చేశారు. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌ పిలుపునిచ్చారు. పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజక వర్గాలు, బూత్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజా సమస్యలు గుర్తించాలి...
ప్రతీ నియోజకవర్గ సమన్వయకర్త.. ప్రతిరోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని జగన్‌ పేర్కొన్నారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో భాగం‍గా సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలన్న జగన్‌.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం తక్కువగా ఉందని, ఇదే ఆఖరి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బూత్‌ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలన్నారు.

లోపాలు గుర్తించి.. వెంటనే సరిదిద్దాలి..
బూత్‌ల సందర్శన మొదటి విడతలో భాగంగా.. పార్టీ నిర్దేశించిన మొదటి 50 బూత్‌ల సందర్శన మొదటి నెలలోనే పూర్తి చేయాలని జగన్‌ పేర్కొన్నారు. దీంతో పాటుగా నియోజక వర్గాలు, మండలాల్లోని బూత్‌ మేనేజర్ల, బూత్‌ కమిటీలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కడ లోపాలు కనిపించినా సరే వెంటనే సరిద్దాలని కోరారు. ప్రతీ 30 నుంచి 35 కుటుంబాలకు ఒక బూత్‌ కమిటీ సభ్యుడి చొప్పున కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

ప్రతీ ఇంటికి నవరత్నాలను చేర్చాలి..
దివంగత మహానేత వైఎస్సార్‌ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ‘నవరత్నాలు’.. పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు దోహదం చేశాయని వైఎస్‌ జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటింటికి నవరత్నాలను చేర్చాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు. అలా అయితేనే కపట బుద్ధి గల చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోగలమంటూ వ్యాఖ్యానించారు. ఆయన ప్రలోభాల కంటే.. నవరత్నాలతో ప్రతీ కుటుంబానికి ఎలాంటి మేలు కలుగుతుందనే అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని జగన్‌ పేర్కొన్నారు. ప్రజలందరి నోళ్లలో నవరత్నాలు నానేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నవరత్నాల ద్వారా జరిగే మేలును వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ పోస్టర్‌ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంటుందని, ప్రతీ ఒక్కరూ దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top