‘తిత్లీ’ బాధితులను ఆదుకోండి

YS Jagan appealed to the Central Govt About Titli cyclone victims - Sakshi

కేంద్రానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి 

భారీగా నష్టం వాటిల్లింది.. వేగంగా స్పందించి అవసరమైన సహకారం అందించాలని వినతి

సాక్షి, న్యూఢిల్లీ: తిత్లీ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేశారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించలేదని లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయని.. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయని, రహదారులు కొట్టుకుపోయాయని.. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరాన్ని వెనుకబడిన జిల్లాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పుడు తిత్లీ తుపాను వల్ల ఆ రెండు జిల్లాల్లో కోలుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. బాధితులను ఆదుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్‌ నేతలతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలు పంపినా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం ఇంకా భారీగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కుదేలైన బాధితులను ఆదుకునేందుకు వేగంగా స్పందించి.. అవసరమైన సహకారం అందించాలని కేంద్రానికి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top