‘కరోనా వ్యాప్తిలో భారత్‌ అగ్రస్థానానికి వెళ్తుంది’ | Sakshi
Sakshi News home page

మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన యశ్వంత్‌ సిన్హా

Published Mon, Jun 1 2020 6:46 PM

Yashwant Sinha Jibe At PM Modi Open Letter To Nation - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘గత సంవత్సరం ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బంగారు అధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి తిరిగి ఓటు వేశారు’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. యశ్వంత్‌ సిన్హా వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

‘శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని యశ్వంత్‌ సిన్హా ట్వీట్ చేశారు.
 

మోదీ-2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ఈ ప్రభుత్వ తప్పు వల్ల కాదని.. మాజీ ప్రధాని నెహ్రూ వల్లనే అని యశ్వంత్‌ సిన్హా ఎద్దేవా చేశారు. నెహ్రూ గనక 1947 నుంచి 1964 వరకూ దేశాన్ని పాలించకపోతే దేశం రెండంకెల వృద్ధి రేటును సాధించేదని వ్యంగ్యంగా  ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement