
సాక్షి, హైదరాబాద్ : నూతన సచివాలయ ప్రతిపాదనలపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడీ ప్రశ్నోత్తరాలు జరిగాయి. వాస్తు కోసమో, దర్పం కోసమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ ప్రతిపక్షాలు నిలదీయగా, ప్రజల ఆమోదంతోనే తాము ముందుకు వెళుతున్నామని అధికార పక్షం ఘాటు సమాధానమిచ్చింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణాలపై బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ సమాధానం చెప్పారు. సీఎం సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
దేశంలోనే చెత్త సెక్రటేరియట్ ఇది : ప్రస్తుత తెలంగాణ సచివాలయం దేశంలోని అతి చెత్త భవనమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘నాటి పాలకులు ఇష్టారీతగా దానిని నిర్మించారు. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరగడానికి కూడా స్థలం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి బ్లాక్ అయితే మరీ దారుణం. ఆ బ్లాక్ వెంనుక కేవలం రెండు ఫీట్ల స్థలం మాత్రమే ఉంది’’ అని తెలిపారు.
వాస్తు ఒక కారణమే కానీ : వాస్తు మాయలో పడి సీఎం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న ప్రతిపక్షం వాదనను కేసీఆర్ ఖండించారు. దేశంలో ఎక్కడికెళ్లినా అద్భుతమైన సచివాలయాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నారు. ‘‘ఏపీలో కొత్తగా నిర్మించబోయే భవనాల నిర్మాణాలు చూశారా? మనం మారొద్దా? ఇక వాస్తు అనేది ఒక కారణం మాత్రమే. వాస్తు కోసమే సచివాలయాన్ని మార్చడం లేదు. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ మ్యాప్‌లను సభ్యులకు ఇచ్చాం. అది కట్టబోయే జింఖానా, బైసన్ పోలో మైదానాలు మనవికావు.. ఆర్మీ వాళ్లవి. సీఎం, మంత్రులు, సంబంధిత డిపార్ట్‌మెంట్ అంతా ఒక్క ఫ్లోర్‌లో ఉండేట్లు నిర్మాణం ఉంటుంది. హెచ్‌వోడీ కాంప్లెక్స్‌లు ఒక దగ్గర కడితేనే మంత్రులకు అనుకూలంగా ఉంటుంది’ అని సీఎం వివరించారు.
హైదరాబాద్ సెంటిమెంట్‌కు దెబ్బ : ఉన్నసచివాలయానికి మరమ్మత్తులు చేసి, ఆధునీకరించకుండా సికింద్రాబాద్‌లో కొత్తది కట్టాలనుకుంటుండటాన్ని ప్రజానీకం గర్హిస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు అన్నారు. ‘‘ప్రజల కోసం చేయాల్సిన మంచి పనులు చాలా ఉండగా, కొత్త నిర్మాణాలంటూ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఉన్న సెక్రటేరియట్‌ను వాడుకోకుండా కొత్తది కడితేనే ఆఫీసుకు వస్తానని ముఖ్యమంత్రి భావించడం దారుణం. ఖాళీగా ఉన్న ఆటస్థలాలను అలాగే వదిలేయాలి’’ అని వాదించారు. అందుకు ప్రతిగా కేసీఆర్ మోదీ ఉదాహరణను చెప్పుకొచ్చారు..
మోదీ కూడా పాతవి వదిలేసి.. : కొత్త సచివాలయ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీని కలిశానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త నిర్మాణాల ఆలోచన అద్భుతమంటూ మోదీ మెచ్చుకున్నారని చెప్పారు. ‘‘మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గాంధీనగర్‌లో అద్భుతమైన సెక్రటేరియట్‌ను కట్టించారు. అంతకుముందే అహ్మదాబాద్‌లో సెక్రటేరియట్ ఉన్నా.. కొత్త భవనాల వల్ల గుజరాత్‌కు ఎక్కడలేని మంచి పేరు వచ్చింది. ఆ నిర్మాణాన్ని ఒక ఐకాన్‌గా వారు ప్రచారం చేసుకున్నారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షించారు’’ అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి వివరణతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త సెక్రటేరియట్‌పై సీఎం కేసీఆర్ ఏమన్నారో వీక్షించండి