అనంత్‌నాగ్‌ సీటుకు ఎందుకు ఎన్నికలు? | Why Polling For Anantnag Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

అనంత్‌నాగ్‌ సీటుకు ఎందుకు ఎన్నికలు?

Mar 12 2019 3:11 PM | Updated on Mar 12 2019 4:54 PM

Why Polling For Anantnag Lok Sabha Constituency - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, శాంతి భద్రతల పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదని ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సునీల్‌ అరోరా చెప్పారు. అలాంటప్పుడు 2016 నుంచి ఖాళీగా ఉన్న అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ? 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ఉగ్ర ఆత్మాహుతి దాడి జరిగిన పుల్వామా జిల్లా కూడా ఈ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోనే ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా అనంత్‌నాగ్‌ నియోజక వర్గానికి మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. 

కల్లోలిత కశ్మీర్‌ అయినాసరే, మూడు విడతలుగా ఓ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించడం అన్నది అసాధారణ విశయం. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా లేదన్నప్పుడు ఎందుకు అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు మొహమ్మద్‌ సాగర్‌ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మెహబూబా ముఫ్తీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హిజుబుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని మరణించడంతో ఈ నియోజకవర్గంలో నిరసనలు, ఘర్షణలు, కాల్పులు చోటుచేసుకొని పలువురు పౌరులు మరణించారు. దాంతో అప్పట్లో ఎన్నికలు నిర్వహించ కూడదని అనుకున్నారు. 

2017, ఏప్రిల్‌ నెలలో అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించానుకున్నారు. అప్పుడు తలెత్తిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. దాంతో ఈ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడం వెనక దురుద్దేశం ఉందని బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నారు. కశ్మీర్‌ ప్రజలు ఈ ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరిస్తారుకనుక, కొద్ది మంది బీజేపీ కార్యకర్తల ఓటింగ్‌తో ఈ సీటును అతి సులభంగా దక్కించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహమని ఆ పార్టీలు విమర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement