నాలో భావోద్వేగాలు అధికం

Why is a particular section of society opposing me - Sakshi

విషం అన్నది కాంగ్రెస్‌ను ఉద్దేశించి కాదు

సిద్దరామయ్యతో ఏ సమస్యా లేదు

ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడపడమే మా ఉమ్మడి లక్ష్యం

ఇండియా టుడే ఇంటర్వ్యూలో కుమారస్వామి  

న్యూఢిల్లీ: గరళకంఠుడిలా సంకీర్ణ ప్రభుత్వ హాలాహలం మింగుతున్నానంటూ ఇటీవల కన్నీళ్లతో ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బుధవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండియాటుడే వార్తాచానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. తన గత వ్యాఖ్యల్లో విషం అన్నది కాంగ్రెస్‌నో, లేక సంకీర్ణ ప్రభుత్వాన్నో ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక ఒక సామాజిక వర్గం వారు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు.

గతంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచిన కొన్ని టీవీ చానెళ్ల విలేకరులు.. సీఎం అయ్యాక మాత్రం తానెన్ని మంచి పనులు చేయాలని చూస్తున్నా వాటిలో తప్పులనే వెదుకుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గం వారే ఇదంతా చేయిస్తున్నారని తెలిసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య మిమ్మల్ని బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తున్నందుకే ఆ రోజు అలా మాట్లాడారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదనీ, సిద్దరామయ్య తనకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సిద్దరామయ్యే కాకుండా స్థానిక నేతలు సహా మొత్తం కాంగ్రెస్‌ పార్టీ తనకు మద్దతుగానే ఉందనీ, నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు.

కుమారస్వామివన్నీ డ్రామాలేనని బీజేపీ అంటుండటాన్ని ప్రస్తావించగా, వారి నుంచి మంచిమాటలు వస్తాయని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు. లోపల ఎంతో బాధ ఉంటేగానీ మనుషులకు కన్నీళ్లు రావనీ, అది అర్థం చేసుకోకుండా తనను విమర్శించేవారికి భావోద్వేగాలు, మానవీయత అంటే ఏంటో తెలిసుండకపోవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. సహజంగానే తనలో భావోద్వేగాలు అధికమన్నారు. అధికారుల బదిలీల్లో కాంగ్రెస్‌ ఒత్తిడేమీ లేదనీ, ఒకవేళ ఉన్నా అలాంటివన్నీ తనకు చిన్నచిన్న విషయాలే తప్ప కన్నీళ్లు పెట్టుకునేంత పెద్దవి కావని చెప్పారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడపడమే జేడీఎస్, కాంగ్రెస్‌ల ఉమ్మడి లక్ష్యమనీ, 2019 సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద సమస్యే కాదని కుమారస్వామి తేల్చి చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top