‘ఆ ఆర్టికల్‌’ గురించి పాలకులకు తెలుసా ?

Who Knows About Article 51A - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు?’ అన్న ప్రశ్నకు ‘ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఇసాక్‌ న్యూటన్‌’ అని ఎవరైనా టక్కున సమాధానం చెప్పారంటే మన కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో న్యూటన్‌ కన్నా ముందే మన పురాణాల్లో గురుత్వాకర్షణ సిద్ధాంత ప్రస్తావన ఉంది. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్తాన్‌ న్యాస్‌’ శనివారం ఏర్పాటు చేసిన ‘జ్ఞానోత్సవ్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 

ఇలా మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. ‘మన రాశి ఫలాల శాస్త్రం ముందు సైన్స్‌ ఎప్పుడూ పిగ్మీ’నే అని చెప్పడమే కాకుండా మన పూర్వికులు ఎప్పుడో అణు పరీక్షలు నిర్వహించారంటూ గత లోక్‌సభ వేదిక సాక్షిగా వాదించారు. అందుకేనేమో ఆయనకు ఈసారి కేంద్ర మంత్రిగా పదోన్నది వచ్చింది. అలా అని ఆయన్ని ఒక్కరినే తప్పుపట్టడం భావ్యం కాదు. చాలా మంది బీజేపీ నాయకులకు ఇలా మాట్లాడే అలవాటుంది. 

ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘టెస్ట్‌ ట్యూబ్‌ బేబీస్‌’ గురించి ప్రాచీన భారతీయులకు ముందే తెలుసునని, సీత పుట్టుకే అందుకు ఉదాహరణని చెప్పారు. టెలివిజన్‌ ప్రసారాల గురించి, విమానాల గురించి కూడా వారికి తెలుసని తెలిపారు. బీజేపీకి చెందిన మరో పార్లమెంట్‌ సభ్యుడు సత్యపాల్‌ సింగ్‌ ‘మానవ పరిణామక్రమం సిద్ధాంతం’ను అంగీకరించేందుకు అసలు సిద్ధంగా లేరు. ప్రాచీన రుషుల శిష్యులే నేటి మానవ జాతని పదే పదే చెబుతూ వస్తున్నారు. అంతెందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే, ప్రాచీన భారతీయులకు జన్యుశాస్త్రం గురించి అంతా తెలుసునని, ప్లాస్టిక్‌ సర్జరీ కూడా అప్పటికే ఉందని, అందుకు వినాయకుడికి ఏనుగు తలను అతికించడమే సాక్ష్యమని చెప్పారు. అసలు ఆత్మసాక్షిగా ఈ విషయాలను నమ్మి మాట్లాడుతారా? అవసరం కోసం మాట్లాడుతారా? అన్నది వారికే తెలియాలి. 

అసలు ఇంత అసంబద్ధంగా మాట్లాడే వారిని జనం ఎలా భరిస్తారబ్బా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. జనంలో అక్షరాస్యత పెరగకపోవడం, ముఖ్యంగా శాస్త్రవిజ్ఞాన దృక్పథం లేక అజ్ఞానంలో బతుకుతుండటం వల్ల భరిస్తుండవచ్చు. కానీ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ‘ఆర్టికల్‌ 51ఏ’ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రవిజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అందుకు పాలకులు కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఆ తర్వాత 2010లో కేంద్రం తీసుకొచ్చిన ‘విద్యా ప్రాథమిక హక్కు’ చట్టంలో ప్రతి విద్యార్థికి శాస్త్ర విజ్ఞాన దక్పథం ఉండాలన్న విషయాన్ని పొందుపర్చారు. దేశంలో అనాదిగా వస్తోన్న ‘బహిర్భూమి’ అనాచారం వల్ల ఏటా లక్షలాది మంది ప్రజలు అంటురోగాలకు గురై మరణిస్తున్నారని, దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలంటూ ప్రభుత్వ విధాన నిర్ణేతలు చెప్పడం కూడా శాస్త్రవిజ్ఞాన దృక్పథమే. ఆ దిక్కుగా మరుగు దొడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందీ, ఇస్తున్నది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీనే. 

దేశంలో విద్యాభివద్ధి కోసం కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖదే. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోఖ్రియాల్‌ కొత్త విద్యా విధానాన్ని ఎలా రూపొందిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే. అసలు కొత్త విద్యా విధానం రూపకల్పన కసరత్తులో భాగంగా నిర్వహించిన ‘జ్ఞానోత్సవ్‌’లోనే గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడారు. చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించి ప్రయోగాలు నిర్వహించేందుకు ‘చంద్రయాన్‌–2’ను పంపించిన భారత్‌లో ఇలాంటి పాలకులు ఉండడం ఆశ్చర్యమే. రాజ్యాంగానికి బద్ధులై ఉంటామని ప్రమాణ స్వీకారం చేసినందున పోఖ్రియాల్‌ సహా పాలకులంతా ‘ఆర్టికల్‌ 51 ఏ’ను గౌరవించాల్సిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top