మోదీ ఆ రోజు తిన్నారా, తినలేదా !? | where was Narendra Modi on that day! | Sakshi
Sakshi News home page

మోదీ ఆ రోజు తిన్నారా, తినలేదా !?

Feb 22 2019 2:28 PM | Updated on Mar 18 2019 9:02 PM

where was Narendra Modi on that day! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడికి 44 మంది భారత సైనికులు మరణించారని తెలిసి యావత్‌ దేశం వారికి నివాళులర్పిస్తుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ చిత్రీకరణలో మునిగిపోయి ఉన్నారు. పైగా ఆయన బోటులో షికారు చేస్తూ మొసళ్లను తిలకిస్తూ గడిపారు. గురువారం సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఆయన షూటింగ్‌లో పొల్గొన్నారు. సాయంత్రం 6.45 గంటలకు టీ, స్నాక్స్‌ తీసుకున్నారు’ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. ఇందులో ఏ మేరకు నిజం ఉంది? పుల్వామా దాడి గురించి తెలిసి కూడా మోదీ షూటింగ్‌ను కొనసాగించారా? సకాలంలో ఆయనకు సమాచారం అందలేదా? అందినా దాన్ని ఆయన పట్టించుకోలేదా? పుల్వామా దాడి గురించి తెలిసి షూటింగ్‌లో పాల్గొనడం తప్పా? 

మోదీపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణల అనంతరం గురువారం చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఇందులో నిజానిజాలేమిటో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతాయి. కాంగ్రెస్‌ ఆరోపణలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముందుగా స్పందిస్తూ జాతీయ సమగ్రతపై ప్రభుత్వంతో ఐక్యంగా ఉంటామని రాహుల్‌ గాంధీ ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇలా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్లోని నిజానిజాల గురించి ఆయన మాట్లాడలేదు. మోదీ టీ, స్నాక్స్‌ తీసుకున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘దేశం మొత్తం స్తంభించిపోవాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందా? దేశ్‌ చల్‌నా ఛాయిహే’ అని వ్యాఖ్యానించారు. అంటే మోదీ టీ, స్నాక్స్‌ తీసుకుంటే తప్పేమిటన్నది ఆయన ప్రశ్న! (ఆ సమయంలో షూటింగ్‌ బిజీలో మోదీ)

ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పందిస్తూ ఈ అంశంపై పాకిస్థాన్‌ ఏం మాట్లాడుతుందో కాంగ్రెస్‌ అదే మాట్లాడుతోందని, ఈ విషయంలో తానింకేం మాట్లాడేది లేదని వ్యాఖ్యానించారు. ఆయన కూడా మోదీ షూటింగ్‌ గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ మాటల్లోని నిజానిజాల జోలికి పోలేదు. ఆ తర్వాత సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ‘న్యూస్‌ఎక్స్‌’ టెలివిజన్‌ ఛానల్‌ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. 
‘పల్వామా దాడి గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సకాలంలో సమాచారాన్ని అందించలేక పోయారు. 

ఆ తర్వాత ఈ విషయన్ని తెలుసుకున్న ప్రధాని మోదీ, దోవల్‌ను మందలించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రధానికి దోవల్‌ సమాచారాన్ని అందించలేకపోయారని ఆ వర్గాలు తెలిపాయి’ అన్నది ఆ వార్తా కథనం. సకాలంలో మోదీకి సమాచారం అందకపోవడం వల్ల ఆయన సినిమా షూటింగ్‌ను కొనసాగించారన్నది ఒక వివరణయితే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లనే దోవల్‌ సమాచారం అందించలేక పోయారన్నది మరో వివరణ. ఇక్కడ మోదీని, దోవల్‌ను వెనకేసుకరావడమే వార్తాకథనం ఉద్దేశమని స్పష్టం అవుతుంది. ప్రధానికి సమాచారం అందించడంలో దోవల్‌ తాత్సారం చేశారంటూ సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఛానల్‌ రిపోర్టర్‌ కూడా ట్వీట్‌ చేశారు. 

ఏ ఉద్దేశంతో వీరు ఈ వార్తను ప్రసారం చేసినా సరే! ఇందులో ఓ ‘బ్లండర్‌’ ఉంది. ఓ షెడ్యూల్‌ కార్యక్రమం మీద సాక్షాత్తు ప్రధాన మంత్రి ఎక్కడికో వెళితే వాతావరణ పరిస్థితుల వల్లగానీ, నెట్‌వర్క్‌ వైఫల్యం వల్లగానీ ఆయనకు సమాచారం ఇవ్వలేక పోయారనడం పెద్ద బ్లండర్‌. అంటే, మన భద్రతా వ్యవస్థ అంత అధ్వాన్నంగా ఉందని చెప్పుకోవడం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే బీజేపీ అధిష్టానం ఆ రోజు (పుల్వామా సంఘటన జరిగిన రోజు) ప్రధాని మోదీ అధికార షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాన్ని చూడగానే ‘న్యూస్‌ఎక్స్‌’ తన వార్తా కథనాన్ని ఉపసంహరించుకుంది. 

మోదీ ఏమీ తినలేదు
బీజేపీ విడుదల చేసిన షేడ్యూల్‌ ప్రకారం ‘మోదీ కార్బెట్‌ నేషనల్‌ పార్కులో ఉండగానే పుల్వామా దాడి గురించి తెల్సింది. ఆయన అక్కడి నుంచే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. రుద్రపూర్‌లో జరగాల్సిన బహిరంగ సభను ఆయన రద్దు చేసుకున్నారు. ఆయన ఏమీ తినకుండానే ఫోన్‌ ద్వారా రుద్రపూర్‌ బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు’. కాంగ్రెస్‌ వార్తను ఖండించడం కోసం ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారన్నది స్పష్టం అవుతుంది. మోదీ టీ, స్నాక్స్‌ తీసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే, అందులో తప్పేముందని బీజేపీ కేంద్ర మంత్రి ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని బీజేపీ వివరించింది. 

పుల్వామా ఉదంతంపై మోదీ సకాలంలో స్పందించారా, లేదా అన్నది ముఖ్యంకానీ ఆయన తిన్నారా, లేదా అన్నది ముఖ్యం కాదు. మోదీ దేశ ప్రయోజనాలకన్నా తన స్వీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటూ ఆయనపై విమర్శలున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. పుల్వామా సంఘటన జరిగిన సరిగ్గా వారం రోజులకు, అంటే గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాకు పర్యటనకు వెళ్లి అక్కడ దేశ రాజధాని సియోల్‌లో శుక్రవారం నాడు అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కషికి గుర్తింపుగా ఓ అవార్డును అందుకున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను మరింత పెంచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement