నాలుగేళ్లలో ఏం చేశారు?

what did in the four Years of ruling..? - Sakshi

సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి

మిర్యాలగూడ : టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు.

నాగార్జునసాగర్‌ సాగర్‌ ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జిని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top