కాంగ్రెస్‌కి సవాలు విసిరిన టిక్‌టాక్‌ స్టార్‌

We Will WIn In Adampur Says TikTok Star BJP Candidate Sonali Phogat - Sakshi

చంఢీగఢ్‌: హర్యానాలోని అదంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫోగట్‌ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. దమ్ముంటే అదంపూర్‌లో ఈసారి గెలిచిచూపించాలని కాంగ్రెస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కుల్దీప్‌ బిషాని ఉద్దేశించి సవాలు చేశారు. కాంగ్రెస్‌ కంచుకోట, రాహుల్‌ గాంధీ సొంత నియోజకవర్గం అమేథిలోనే ఓటమిని చవిచూసిన పార్టీని ఇక్కడ కూడా ఓడించడం తమకు పెద్ద కష్టమేమీ కాదని ఆమె అన్నారు. అమేథి ఫలితాలే ఇక్కడా పునరావృత్తమవుతాయని సోనాలీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా అదంపూర్‌ ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేస్తున్నారని కానీ.. జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఆమె విమర్శించారు.

హర్యానాకు చెందిన సొనాలీ ఫోగట్‌కు టిక్‌ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతోనే ఈ టిక్‌ టాక్‌ స్టార్‌ను బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది. అదంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీజేపీ సొనాలీకి కేటాయించింది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్‌ పేరును చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అదంపూర్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత అదంపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కుల్దీప్‌ బిషానికే కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ 2000 ,2005 ఎన్నికల్లో గెలుపొందారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో భజన్‌ లాల్‌కు చెందిన కుటుంబం సభ్యులే గెలుపొందారు. దీంతో బీజేపీ అదంపూర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా టిక్‌ టాక్‌ స్టార్‌కు టికెట్‌ కేటాయిస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top