కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా ప్రయోగిస్తానంటూ చెప్పిన ‘హైడ్రోజన్ బాంబు’ ఎట్టకేలకు బిహార్ తొలి దశ పోలింగ్‌కు 24 గంటల ముందు బుధవారం బద్దలైంది. ఇది నిరుడు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల జాబితాకు
సంబంధించింది. రాహుల్ చెబుతున్న ప్రకారం అందులో 25 లక్షలమంది నకిలీ ఓటర్లున్నారు. సహజంగానే ఎన్నికల సంఘం(ఈసీ) మినహా దేశంలో అందరికీ ఈ విషయం దిగ్భ్రాంతి కలిగించింది. బ్రెజిల్‌లో ఉంటున్న పోర్చుగీసువాసి హెయిర్ డ్రెసర్ లారిసా నెరి అనే యువతి ఫొటోకు ఈ జాబితాలో చోటు దొరికింది. ఒకసారి కాదు... 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 22 సార్లు వినియోగించారు.
‘సెర్చ్’లో దొరక్కుండా ఒక్కో చోట ఒక్కో పేరు తగిలించారు. స్వీటీ, సరస్వతి, సీమ...ఇలా బహుళ నామధేయాలతో ఆమె మన ఎన్నికల జాబితాలో వర్ధిల్లింది. బహుశా 22 సార్లూ తన ఓటు హక్కు ‘విని యోగించుకుని’ ఆమె తన ‘పవిత్ర కర్తవ్యాన్ని’ నెరవేర్చి ఉంటుంది. మీడియా సమావేశంలో ఆమెను రాహుల్ బ్రెజిల్ మోడల్‌గా చెప్పారు. ఇది స్పీడ్ యుగం కనుక ఆ సమా వేశం ముగిసిన వెంటనే విషయం ఆమెకు చేరిపోయింది. ఏనాడూ సందర్శించని దేశంలో ఎన్నికల జాబితాలో తన పాత ఫొటో రావటంపై ఆమె బోలెడు ఆశ్చర్యపోతోంది. జనాన్ని దగా చేయటానికి తన ఫొటో వినియోగించి ఉంటారని సరిగానే గుర్తుపట్టింది.
నకిలీ ఓటర్ల పంచాయతీ రాహుల్–ఈసీలకు సంబంధించింది కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరి మాటే నిజం కావాలి కనుక జరిగిందేమిటో ఈసీ సంజాయిషీ ఇచ్చితీరాలి. తప్పు తనవైపుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ ఆరోపణ అవాస్తవమైతే ఆయనపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదీ చేయకుండా ‘అప్పుడెందుకు చెప్పలేద’ంటూ దబాయింపులకు దిగటం నైతిక పతనానికి చిహ్నమవుతుందే తప్ప సమర్థవంతమైన జవాబు కానేరదు.
సీ–డాక్ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఉపకర ణాన్ని 2022లో వినియోగించారు. వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) పేరిట జరిగిన ఆ ప్రక్రియలో దాని సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగించారు. ఇవన్నీ ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదైన ఓట్లు, చెల్లని ఓట్లు. ఆ ఉపకరణం ఒకటికన్నా ఎక్కువసార్లు వినియోగించిన ఫొటోను కూడా పసిగడుతుంది. దానికి ఎందుకు స్వస్తి చెప్పారో ఈసీ సంజాయిషీ ఇవ్వాలి.
అసలు ఈసీకీ, ఈ 12.5 శాతానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటో అర్థంకాదు. రాహుల్ లెక్క ప్రకారం హరియాణాలో 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలైన వెంటనే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికీ, నాలుగు రోజుల తర్వాత అదే సంస్థ చెప్పిన శాతానికీ మధ్య వ్యత్యాసం కూడా 12.5 శాతమే! ఇంత శ్రద్ధగా లెక్క పాటిస్తున్న మాయావులెవరో ఈసీ తేల్చుకోవాలి.
రాహుల్ ఆరోపణలకు ఈసీ ఎగవేత ధోరణిలో జవాబిస్తున్నందువల్ల కేంద్రం జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. జాబితాలో చేరిన నకిలీ ఓట్ల సంగతలా ఉంచి... గల్లంతైన ఓట్లు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్డీటీవీ బృందం ఆరా తీసిన ప్రకారం హరి యాణాలో ఒక గ్రామంలోని పలు కుటుంబాల్లో రెండు నుంచి నాలుగు ఓట్లు గల్లంత య్యాయి. చిత్రమేమంటే వీరు ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఓటేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాదిరి లీలలు బహు విధాలు! నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచే అక్రమాలు మొదలైపోయాయి. నిజానిజాలేమిటో నిర్ధారించుకోకుండానే కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయి దేళ్లుగా అమలవుతున్న పథకాలు ఆపేశారు. బదిలీల వెనకున్న కుతంత్రమేమిటో పోలింగ్ రోజు హింస బయటపెట్టింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షలు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇక ఈవీఎంల విన్యాసాలు అనంతం.
సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసి 17 నెలలు గడుస్తున్నా జవాబు లేదు! కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించి కూడా ఇలాగే ఫిర్యాదులొచ్చాయి. ఈ స్థితిలో జరుగుతున్న, జరగబోయే ఎన్నికలపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇకనైనా ఈసీ బాధ్యులు నోరు విప్పాలి. ఆ ఉద్దేశం లేకుంటే తప్పుకోవాలి.


