భారత్‌ బంద్‌ హింసాత్మకం..!

Violent protests in Agra during bharat bandh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ప్రతిపాదించిన మార్పులను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ పలుచోట్ల హింసాత్మకంగా మారింది. బంద్‌లో భాగంగా సోమవారం ఉదయం దళిత సంఘాల కార్యకర్తలు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. నిరసనకారులు తెరిచి ఉన్న పలు దుకాణాలపై దాడులు చేసి.. ధ్వంసం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్థానిక పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రాలో ఉద్రిక్తత నెలకొంది.

దేశవ్యాప్తంగా ‘భారత్‌ బంద్‌’విజయవంతంగా కొనసాగుతోంది. పలుచోట్ల దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పంజాబ్‌లోని లుథియానా, జిరాక్‌పూర్‌లో దళిత సంఘాలు రోడ్డెక్కాయి. భారత్‌ బంద్‌లో భాగంగా నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో బిహార్‌, ఒడిశా, పంజాబ్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిహార్‌లోని పట్నా, ఫోర్బెస్‌గంజ్‌, ఆర్హా ప్రాంతాల్‌ భీమ్‌ ఆర్మీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.

పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు
భారత్‌ బంద్‌ సందర్భంగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా సిబ్బంది మహిళలని చూడకుండా నిరసనకారులపై లాఠీ ఝళిపించారు. దీం‍తో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో పోలీసులు నిరసనకారులతోపాటు రోడ్డుపై దొరికిన వారిని కూడా చితకబాదారు. మధ్యప్రదేశ్‌ భింద్‌లోనూ పెద్దసంఖ్యలో మూగిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశంలోని చాలాచోట్ల నిరసనకారుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొది. పలుచోట్ల నిరసనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. ర్యాలీలు నిర్వహించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top