టీడీపీ, జనసేనకు మీరు జాయింట్‌ డైరెక్టర్‌ 

Vijaya Sai Reddy Slams VV Lakshminarayana - Sakshi

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజం 

మీ చీకటి పొత్తులను ప్రజలు అర్థం చేసుకున్నారు 

మూడు నెలల్లో మూడు పార్టీలా.. అంటూ ఎద్దేవా 

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయ సాయిరెడ్డి శనివారం సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జేడీ గారూ.. మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసిందే. తీర్థం (బీఫామ్‌ మీద సంతకం) జనసేనది. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చింది 175లో 65 బీఫామ్‌లు. కాదు మొత్తం తెలుగుదేశం చెబితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘జేడీ గారూ.. మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది.

ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. పాపం! బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్దతు మాత్రం మీకివ్వాలని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు’ అని నిలదీశారు. ‘జేడీ గారూ.. మీరు 2 నెలల క్రితం లోక్‌ సత్తా కండువా కప్పుకోబోయి.. నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి.. ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు? లక్ష్మీనారాయణ గారూ.. మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి – జనసేనకు జాయింట్‌ డైరెక్టర్‌! నేరగాళ్ల పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!’ అంటూ విజయసాయి రెడ్డి ఎత్తిపొడిచారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top