‘చంద్రబాబు..  ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu Dharma Porata Deeksha - Sakshi

ట్వీటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. ‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!’ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏ ప్రయోజం లేదన్నారు. పిల్లలు కూడా ఆరాటం కొద్దీ చదువుతారని కానీ పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రావని వివరించారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష కూడా అలాంటిదేనని విమర్శించారు. 

చంద్రబాబును మించిన అవకాశవాది దేశం మొత్తం మీద ఎక్కడా కనిపించరని మండిపడ్డారు. దోచుకోవడానికే కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని తనే నిర్మిస్తానని చంద్రబాబు తీసుకున్నాడని ఏడాది క్రితం కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్ తిట్టిపోశాడని, కానీ ఇవ్వాళ ఆ ఇద్దరు ఆలింగనాలు చేసుకుంటుంటే ఇంత దిగజారుడుతనమా అనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసని, ఆయన ప్రధానిగా ఉండగా ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు లైసెన్సులిప్పించి ఎంత దోచుకుందీ అనేక సార్లు ఆయన సీనియర్ నేతలకు చెప్పారన్నారు. దీక్ష ముగింపు రిచ్‌గా ఉంటుందని బతిమాలితే ఇష్టం లేకున్నా నిమ్మరసం తాగించారన్నారు. ఇక డబ్బాకొట్టుకోవడంలో చిట్టినాయుడు లోకేష్‌ తండ్రిని మించిపోయాడని ఎద్దేవ చేశారు. తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటుంటే.. కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో “అతి పేద్ద” ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటున్నాడని తెలిపారు. నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా.. కుల మీడియా మాత్రం తెగ హైరానా పడుతుందని విమర్శించారు. బులెటిన్ల నిండా దీక్ష విజువల్సేనని, మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక జనాలు చానళ్లు మార్చుకుంటున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top