ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.! | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.!

Jun 28 2019 2:07 PM | Updated on Jun 28 2019 7:19 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమో..

సాక్షి, అమరావతి : అక్రమ నిర్మాణమైన ప్రజావేదిక కూల్చివేతను కూల్చడం అనొద్దని, ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలని సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూలమీడియాపై ధ్వజమెత్తారు.

‘చంద్రబాబు ప్రభుత్వం రూ.9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. గణేశ్ మండపానికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువని సోషల్ మీడియాలో యువత చెణుకులు విసురుతోంది. దాన్నికూల్చడం అనొద్దట. ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.’ అని విజయసాయిరెడ్డి సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. తమ అధినేత అవినీతిని సమర్థించడం మినహా కళా వెంకట్రావు చేయగలిగిందేముందనక్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు వేసిన అంచనాల ప్రకారం విద్యుత్తు కొనుగోళ్లపై అదనంగా రూ. 2,636 కోట్ల చెల్లింపులు జరిగాయని వెల్లడైందన్నారు. ప్రజాధనం లూటీ చేసిన వారు ఆ మొత్తాలను కక్కక తప్పదని తెలిపారు.

అనుకూల మీడియా మళ్లీ చంద్రబాబు పల్లకి సేవ మొదలు పెట్టిందని, నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయన్నారు. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలని సూచించారు. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమోనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement