‘నిర్మాణ లోపాలు తేటతెల్లమవుతున్నాయి’

Uttam Kumar Visits Kondapochamma Sagar Project In Siddipet - Sakshi

సాక్షి, సిద్ధిపేట : కొండ పోచమ్మ సాగర్  ప్రాజెక్టు ప్రారంభించిన నెల రోజుల్లోనే కాలువలకు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కాలువకు గండి పడ్డ ప్రాంతాన్ని ఉత్తమ్ కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం రైతుల కోసమా ? లేక కేసీఆర్ కోసమా ? అనేది అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై రాష్ట్ర స్థాయిలో నిలదిస్తామని దీనిపై పోరాడుతామని తెలిపారు. కాలువలకు గండి పడటం సహజం అంటున్న ఈఎన్సీ హరి రామ్ అసలు ఇంజనీర్‌ అవునా కాదా అన్న అనుమానం కలుగుతోందని ఉత్తమ్‌ మండిపడ్డారు. (కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి)

గండ్లు పడే ప్రాజెక్టులు, కాలువలు నిర్మిస్తున్నారా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. గండ్లు  సహజం అంటున్న ఈఎన్‌సీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. కాలువకు గండి పడితేనే ఇలా ఉంటే.. ప్రాజెక్టులకు గండి పడితే పరిస్థితి మరెంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రజలే గుర్తించాలని సూచించారు. కాలువ గండి పడి నష్టపోయిన శివారు వెంకటాపూర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నష్ట పోయిన ప్రాంతాన్ని పరిశీలించడానికి జిల్లా  కలెక్టర్ వెంకట్రామి రెడ్డికి సమయం లేదా అని నిలదీశారు. కేసీఆర్‌ ఫామ్ హౌస్  పక్కనే  కాలువకు గండి పడ్డదంటే నిర్మాణ లోపాలు తేట తెల్లం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటి వరకు చెక్కు చెదర లేదని పేర్కొన్నారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top