కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

Uttam kumar reddy at Palwai govardhan reddy's first death anniversary - Sakshi

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ

చండూరు (మునుగోడు): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చండూరులో దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సభలో ఆయన రాజ్యసభ సభ్యుడు వాయలార్‌ రవితో కలసి పాల్గొన్నారు. పాల్వాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గతంలోనూ కాంగ్రెస్‌ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం నాలుగు విడతలుగా మాఫీ చేసిందన్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేయడంతో రైతులు అధిక వడ్డీ భరించాల్సి వచ్చిందన్నారు. ఆ వడ్డీని కూడా ప్రభుత్వం భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించి.. చివరకు మాట తప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.

కాగా, తమ ప్రభుత్వం వస్తే పత్తిని రూ.6 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. మిర్చి పంటకు రూ.10 వేలు, పప్పు ధాన్యాలకు రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. వరి, ఇతరత్రా పంటల కొనుగోలుకు రాష్ట బడ్జెట్‌నుంచి అధిక నిధులు కేటాయించి బోనస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి అందిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం ఓకే కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలుగా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.

డిసెంబర్, జనవరిలలో ఎన్నికలు వస్తాయనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎకరాకు నాలుగు వేలు ఇస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెక్‌ పెట్టేందుకు రాష్ట ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు మల్లు రవి, చిన్నారెడ్డి, సమరసింహారెడ్డి, పద్మావతి, çసర్వోత్తమ్‌రెడ్డి, మైసూరారెడ్డి, బూడిద భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top