సర్కారును జనంలోనే ఎండగడతాం | Sakshi
Sakshi News home page

సర్కారును జనంలోనే ఎండగడతాం

Published Thu, Mar 29 2018 2:46 AM

Uttam kumar reddy on Democracy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని తరిమేసి కీలకమైన బిల్లును ఆమోదించుకున్నారని మండిపడ్డారు. ‘‘అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు హక్కు మేరకు నిరసన వ్యక్తం చేస్తే బడ్జెట్‌ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్‌ చేశారు. అంతేగాకుండా ఇద్దరు శాసన సభ్యులను బర్తరఫ్‌ చేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం.

ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ఈ పాలకుల నిజస్వరూపాన్ని ప్రజల్లోనే ఎండగడతాం’’అని తెలిపారు. ప్రజాచైతన్య బస్సు యాత్ర రెండో విడతపై ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో సమావేశం జరిగింది. అనంతరం షబ్బీర్‌తో కలిసి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అన్ని విషయాల్లో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని, రిజర్వేషన్ల అంశాన్ని ముందుంచి వారం రోజులుగా పార్లమెంట్‌ నడవకుండా అడ్డుకుంటోందని విమర్శించారు.

అన్యాయంగా ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్‌ చేశారని కేసు వేశామని, దీనిపై స్పందించిన కోర్టు.. అసెంబ్లీ వీడియో పుటేజీలు అడిగితే ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. దీన్ని బట్టే ఎమ్మెల్యేలను అక్రమంగా బర్తరఫ్‌ చేసినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం లేకుండా అత్యంత కీలకమైన ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు, పంచాయతీ సవరణ బిల్లులను ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండా ఇలాంటి బిల్లులను ఆమోదించుకోవడం ప్రజాస్వామ్యమా? ఎవరి మెప్పు కోసం ఈ బిల్లు తెస్తున్నారు? ఓవైపు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో పోరాటాలు చేస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌... రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా ఎలా యూనివర్సిటీ బిల్లు తెచ్చింది? ఇది రెండు నాలుకల ధోరణి కాదా’’అని ప్రశ్నించారు.

ఏప్రిల్‌ 1 నుంచి రెండో దశ ప్రజా చైతన్య బస్సుయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం రామగుండంలో సభ ఉంటుందని, రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు సింగరేణి కార్మిక సంఘాలతో సమావేశమవుతామని వివరించారు. ఈ యాత్రకు మాజీమంత్రి దానం నాగేందర్‌తోపాటు మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కో చైర్మన్‌గా ఉంటారన్నారు.

ఇదీ బస్సు యాత్ర షెడ్యూల్‌..
2వ తేదీన పెద్దపల్లిలో, 3న మంథనిలో, అదేరోజు సాయత్రం 6 గంటలకు భూపాల్‌పల్లిలో, 4న స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తిలో, 5న నర్సంపేటలో, 6న పరకాల, వరంగల్‌లో, 7న ఇల్లెందు, పినపాకలో, 8న డొర్నకల్, మహబూబాబాద్‌లో సభలు నిర్వహిస్తామన్నారు. 9న భద్రచలంలో దేవాలయంలో దైవ దర్శనం అనంతరం వెంకటాపురంలో, ములుగులో, 10న వర్ధన్నపేటలో సభలు ఉంటాయన్నారు.

‘డబుల్‌’లో ప్రభుత్వం విఫలం
ఏ పథకాల విషయంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందో ఆ పథకాలను కాంగ్రెస్‌ ఆచరణలో చేసి చూపాలని ఉత్తమ్‌ అన్నారు. జీవన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో హౌజింగ్, పెన్షన్ల సలహా సంఘం సమావేశం జరిగింది. ఇందులో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా చేపట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

Advertisement
Advertisement