సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్‌

Uttam Kumar Reddy on Congress Party  Membership Drive in Telangana  - Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: సభ్యత్వ నమోదు, శిక్షణపై ప్రత్యేక దృష్టితో పనిచేయనున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఏఐసీసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అక్టోబర్‌ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలను వీధివీధినా జరపాలని సమావేశం నిర్ణయించింది.  సభ్యత్వ నమోదు ప్రక్రియ అమలుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చపై అధ్యక్షురాలు సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుని రెండు, మూడు రోజు ల్లో మార్గదర్శకాలు జారీ చేస్తారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తోందో మాజీ ప్రధాని మన్మోహన్‌ వివరించారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి కనబరుస్తోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది’అని పేర్కొన్నారు.  

‘బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువ’ 
శాసనసభలో, బయటా ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధమవుతున్నామని ఉత్తమ్‌ చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ‘హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉంది. బీజేపీ విభజన రాజకీయాలు కుదరవు. తెలం గాణకు ఏం చేశారని బీజేపీ ఎదుగుతుంది? బిల్లులో ఉన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఇవ్వలేదు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఒక్కరికే పరిమితమయ్యారు. ఎన్నికలు 2023లో జరిగినా అంతకుముందు జరిగినా టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని ఉత్తమ్‌ పేర్కొన్నారు.
 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top