వారణాసి దుర్ఘటనపై రాజకీయ దుమారం

UPCC Chief Raj Babbar Comments On Varanasi Flyover Collapse - Sakshi

వారణాసి: ప్రఖ్యాత ఆథ్యాత్మిక నగరం వారణాసిలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేశారు. అధికారులు, ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. సదరు ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నది ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘యూపీ స్టేట్‌ బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ సంస్థ కావడంతో ఇటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద మంగళవారం సాయంత్రం ఫ్లైఓవర్‌ పిల్లర్‌ విరిగిపడి.. కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

ఆలయాల ధ్వంసం వల్లే: యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ బుధవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం మూడు వినాయకుడి ఆలయాలను ధ్వంసం చేశారని, దేవుడి శాపం వల్లే ఫ్లైఓవర్‌ కూలిపోయిందని స్థానికులు అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మొన్నటి ఉప ఎన్నికలకు ముందే ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న తొందరలో పనులను అడ్డదిడ్డంగా, నాసిరకంగా చేశారు. పైగా, ఇక్కడ మూడు వినాయకుడి గుడులు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జి కోసం వాటని ధ్వంసం చేశారని, ఆ శాపం వల్ల ఇంతటి విపత్తు సంభవించిందని వారు భావిస్తున్నారు’’ అని రాజ్‌ బబ్బర్‌ అన్నారు. కాగా, 2016నాటి కోల్‌కతా ఫ్లైఓవర్‌ దుర్ఘటన ‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌కు దేవుడి హెచ్చరిక’’ అని మోదీ వ్యాఖ్యానించిన పాత వీడియోలు మళ్లీ వైరల్‌ అయ్యాయి. నాటి దుర్ఘటన ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదు యాక్ట్‌ ఆఫ్‌ ఫ్రాడ్‌’ అని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే.  

సూపర్‌ వైజర్‌పై కేసు: ఫ్లైఓవర్‌ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే నిర్మాణ సంస్థకు చెందిన పలువురు అధికారులు, ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రజల ప్రాణాలను హరించారంటూ స్టేట్‌ బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌పై సిగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఐపీసీ సెక్షన్‌ 304 కింద సంస్థ సూపర్‌ వైజర్‌పై కేసు నమోదుచేశామని సిగ్రా ఎస్‌ఐ ధనానంద్‌ త్రిపాఠి తెలిపారు.

రూ. 200 లంచం తీసుకున్న చిరుద్యోగి అరెస్ట్‌: కాగా, వారణాసి ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో  చేర్పించారు. ఒకానొక బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో వార్డుబాయ్‌ రెండు వందల రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుల ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు చిరుద్యోగిని అరెస్టు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top