మంత్రివర్గంలో హరీశ్‌.. గులాబీలో జోష్‌

TRS Leaders Celebrates Harish Rao Induction Into Cabinet - Sakshi

పద్దుల మంత్రిగా హరీశ్‌రావు

ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

ఎనిమిది నెలల ఉత్కంఠకు తెర

ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా సంబరాలు

సాక్షి, సిద్దిపేట: ఎనిమిది నెలల ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకమైన శాఖను ఆయనకు కట్టబెట్టారు. రాష్ట్ర నూతన గవర్నర్‌ తమిళిసై మంత్రిగా హరీశ్‌రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు జోష్‌లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.   

తెలంగాణ ఉద్యమకాలం నుంచి రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణకు బాటలు వేయడంలో కీలక భూమిక పోషించిన హరీశ్‌రావుకు రెండో సారి ఏర్పడిన  ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎనిమిది నెలలుగా ఉమ్మడి మెదక్‌  జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హరీశ్‌రావు అభిమానులు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఎవరి సేవలు ఎప్పుడు వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో సారి మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావుకు చోటు కల్పించారు. అందరూ ఊహించిన విధంగానే కీలక శాఖ దక్కింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. 

ప్రగతి భవన్‌కు తరలివెళ్లిన నాయకులు ఎనిమిది నెలల తర్వాత తమ నాయకుడికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే వార్త తెలియగానే సిద్దిపేటతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రగతి భవన్‌ బాటపట్టారు. ఉదయం నుంచి హరీశ్‌రావు వెంటనే ఉన్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకరెడ్డితోపాటు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి,
మాణిక్‌ రావు, క్రాంతికిరణ్‌ తోపాటు ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, సిద్దిపేట జిల్లా జెడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేలేటి రాధాకిష్ణ శర్మ, ఎస్సీకార్పొరేషన్‌ చైర్మన్‌ ఎర్రొళ్ల శ్రీనివాస్, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మండల అధ్యక్షుడు ప్రగతి భవన్‌ చేరుకొని హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సన్నివేశాన్ని వీక్షించారు. అనంతరం అభినందనలు తెలిపారు. దీంతో ప్రగతి భవన్‌ అంతా కోలాహలంగా మారింది. 

అభిమానుల ఆనందం
సిద్దిపేటజోన్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రిగా స్థానం కల్పించడంతో గులాబీకోట సిద్దిపేటలో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉదయం నుంచే పత్రికల్లో వచ్చిన ముందస్తు కేబినెట్‌ విస్తరణ కథనాలపై పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా గమనించారు. ఒక దశలో  ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో హరీశ్‌రావు రాష్ట్ర మంత్రిగా  ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్‌తో పాటు పట్టణం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.  హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపి, రాజ్‌ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సంబురాలు
హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆదివారం టీఆర్‌ఎస్వీ సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడు పెర్కబాబు ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్‌ చౌరస్తాలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు రామ్మోహన్, సాయిప్రేమ్, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసగృహం వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కూర బాల్‌రెడ్డి, ముదిగొండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి సంబురాలు నిర్వహించారు.
 
నైట్‌ షెల్టర్‌లో పండ్ల పంపిణీ హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా  స్థానిక 23వ వార్డులోని నైట్‌షెల్టర్‌లోని అభాగ్యులకు వార్డు కౌన్సిలర్‌ తాళ్లపల్లి లక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పద్మారెడ్డి, షాదుల్, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

హరీశ్‌రావు ప్రొఫైల్

పేరు: తన్నీరు హరీశ్‌రావు
తండ్రి: సత్యనారాయణరావు
తల్లి: లక్ష్మిబాయి
పుట్టినతేది: 03 జూన్‌ 1972
విద్యార్హతలు : డిప్లామా ఇన్‌ ఇంజినీరింగ్‌
స్వగ్రామం  : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి
పుట్టిన ఊరు : చింతమడక (సిద్దిపేట మండలం)
భార్య : శ్రీనితరావు 
పిల్లలు : కుమారుడు ఆర్చిస్‌మెన్, కుమార్తె వైష్ణవిత
హబీలు: పుస్తక పఠనం 

రాజకీయ జీవితం :

  •      2004లో జరిగిన సిద్దిపేట ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా హరీశ్‌రావు విజయం సాధించి రాజకీయ అరంగేట్రం చేశారు. 
  •      2004లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో హరీశ్‌రావు రాష్ట్ర యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా కొంతకాలం పని చేశారు. 
  •      2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా శాసన సభ్యాత్వానికి రాజీనామ చేయడం, తిరిగి ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 
  •      2009 సార్వత్రిక ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 
  •      2010లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి సిద్దిపేట నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
  •      2014లో జరిగిన జమిలీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి శాసనసభకు ఎన్నికైన కేసీఆర్‌ మంత్రి వర్గంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, భారీ నీటి పారుదలశాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టారు. 
  •      ఇదే క్రమంలో గురువారం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు రావడంతో హరీశ్‌రావు 2018లో తన శాసన సభ్యాత్వాన్ని కోల్పోయారు.
  •      2019లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో వరుసగా ఆరో సారి హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో లక్ష పైచిలుకు భారీ మెజార్టీని సాధించారు. 
  •      సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణలో భాగంగా నేడు రెండోసారి  మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.  
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top