నీకా..నాకా!?

TRS Candidates ZPTC Chairman Full Competitions - Sakshi

సాక్షి, జనగామ: జిల్లాలోని జెడ్పీటీసీ స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్వీన్‌స్వీప్‌ చేసింది. 12 స్థానాల్లోను 12 చోట్లా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా గ్రాండ్‌ విక్టరీని సొంతం చేసుకుంది.  అయితే ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థుల్లో జెడ్పీ చైర్మన్‌ ఎవరనేది ఆసక్తిగా మారుతోంది. జెడ్పీ చైర్మన్‌ స్థానం జనరల్‌కు కేటాయించారు. విజయం సాధించిన వారిలో చాన్స్‌ ఎవరి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

గుడి, పాగాల మధ్య తీవ్ర పోటీ
జెడ్పీటీసీలుగా గెలుపొందిన సభ్యుల్లో లింగాల ఘనపురం నుంచి విజయం సాధించిన గుడి వంశీధర్‌రెడ్డి, చిల్పూర్‌ మండలం నుంచి విజయం సాధించిన పాగాల సంపత్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నది. ఇద్దరు జెడ్పీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. మొదటి నుంచి జెడ్పీ చైర్మన్‌ స్థానంపై ఆశలు పెట్టుకొని జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించడంతో చైర్మన్‌ కూర్చీ పోటీ పడుతున్నారు. జనరల్‌ స్థానం కావడంతో ఇద్దరిలో ఒక్కరికే అవకాశం దక్కే అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏమైన సమీకరణలు మారితే మహిళలకు చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయి. మహిళలకు చాన్స్‌ వస్తే తరిగొప్పుల నుంచి గెలుపొందిన ముద్దసాని పద్మజారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వంశీధర్‌కు అధిష్టానం ఆశీస్సులు
రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గుడి వంశీధర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం ఆశీస్సులున్నాయి. కేటీఆర్‌ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రామాలను ఏకగ్రీవం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మాదారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. అయితే సొంత మండలం రఘునాథపల్లిలో రిజర్వేషన్‌ కలిసి రాక పోవడంతో లింగాల ఘనపురం నుంచి జెడ్పీటీసీ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. వంశీధర్‌రెడ్డి తరుఫున స్వయంగా మంత్రి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి దయాకర్‌రావు అండదండలతోపాటు పార్టీ పెద్దల సపోర్టు ఉండడంతో జెడ్పీ చైర్మన్‌ వంశీధర్‌రెడ్డికే దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచే చైర్మన్‌ రేసులో యువనేత ఉండడం విశేషం.

ఉద్యమకారుడిగా సంపత్‌రెడ్డి
చిల్పూర్‌ మండలం నుంచి గెలుపొందిన పాగాల సంపత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉమ్మడి స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి నియోజకవర్గ కో కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలతో సంబంధాలున్నాయి. చిల్పూర్‌ జనరల్‌ స్థానం నుంచి గెలుపొందడంతో చైర్మన్‌ రేసులో సంపత్‌రెడ్డి ఉన్నారు.

ఘన్‌పూర్‌ కోటాలోనే చైర్మన్‌..
జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. జనగామ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ పదవి ఇచ్చారు. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్‌ పదవిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో లింగాల ఘనపురం, చిల్పూర్‌ మండలాలు ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ రెండు మండలాల నుంచి గెలుపొందిన వంశీధర్‌రెడ్డి, పాగాల సంపత్‌రెడ్డిలో ఒక్కరికి చాన్స్‌ దక్కే అవకాశం ఉంది. నేడో రేపో చైర్మన్‌ అభ్యర్థిని పార్టీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top