
పీఆర్, ఆర్‌డీ డైరెక్టర్ పేరిట గెజిట్ జారీ
రేపు తెల్లవారుజాముకల్లా జిల్లాల్లో రిజర్వేషన్లు సిద్ధం
ఆదివారం ఎస్‌ఈసీకి పీఆర్‌శాఖ అందించే అవకాశం.. ఆ వెంటనే నోటిఫికేషన్ ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్‌ను జారీచేసింది. శనివారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ డా.జి.సృజన పేరిట రాజపత్రం జారీ అయ్యింది. ఈ గెజిట్‌కు అనుగుణంగా ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13, అన్ రిజర్వ్‌డ్‌కు 8 జెడ్పీ చైర్‌పర్సన్ పదవులను రిజర్వ్ చేయగా, అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పదవులు రిజర్వ్ చేశారు. శనివారం ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ కార్యాలయంలో రాజకీయ పక్షాలతో నిర్వహించిన సమావేశంలో అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లకు సంబంధించిన లాటరీ నిర్వహించారు.
తదనుగుణంగా ఆయా కేటగిరీల్లో ఈ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కేటగిరీల వారీగా చైర్‌పర్సన్ల పదవులకు రిజర్వేషన్లను పరిశీలిస్తే బీసీలకు 41.96 శాతం, ఎస్సీలకు 19.35 శాతం, ఎస్టీలకు 12.90 శాతం, అన్‌రిజర్వుడ్‌కు 25.80 శాతం దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ పదవుల్లో మొత్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 74.20 శాతం రిజర్వేషన్లు ఖరారు కాగా, అన్‌రిజర్వుడ్ (జనరల్) కేటగిరీకి 25.80 శాతం లభించినట్టుగా స్పష్టమవుతోంది.
జిల్లాల్లో రిజర్వేషన్ల కసరత్తు ఇలా...
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే, ఆ తర్వాత పీఆర్‌ఆర్‌డీ స్థానిక సంస్థల్లోని అన్ని పోస్టులకు అంటే... వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలు, జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ, అన్‌రిజర్వుడ్ స్థానాల్లో రిజర్వేషన్లకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో అన్ని పదవులకుగాను ఇదే ఫార్ములాను అన్ని జిల్లాల్లోనూ అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యలో జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) కలిసి ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి దాదాపుగా కొలిక్కి తెచి్చనట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికల్లా దాదాపు 15 దాకా జిల్లాల్లో పూర్తిస్థాయిలో రిజర్వేషన్ల జాబితాలు–కంప్లీట్ షేప్‌లో (అన్ని స్థానాలకు) సిద్ధమైనట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో సర్పంచ్‌లు, మిగిలిన జిల్లాల్లో చాలా వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియకు అధిక సమయం తీసుకుంటుండడంతో ఆలస్యం అవుతున్నట్టుగా పీఆర్ కమిషనరేట్‌కు సమాచారం అందుతోంది.

31 జిల్లాల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, పంచాయతీల్లోని ఆయా స్థానాలకు రిజర్వేషన్లు, జిల్లాల వారీగా గెజిట్‌లు అందాక అన్నింటిని పీఆర్ డైరెక్టర్ ఒకసారి సరిచూస్తారు.ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నంలోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) అందజేస్తే,.. ఎస్‌ఈసీ షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోపాటు, రాబోయే మూడురోజుల్లో ఆయా పోస్టులకు నామినేషన్లు కూడా స్వీకరించే అవకాశాలున్నాయి. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం తెల్లవారుజాముకల్లా ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని పీఆర్ వర్గాల సమాచారం.
ఈ కసరత్తు ముగిసిన వెంటనే జిల్లాల వారీగా గెజిట్‌లను సిద్ధం చేసుకొని, మూడేసి గెజిట్ సైన్డ్ కాపీలను పీఆర్ ఆర్‌డీ కమిషనరేట్‌లో అందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల్లో ఆయా పోస్టులకు రిజర్వేషన్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు పీఆర్‌ఆర్డీ డైరెక్టర్ డా.సృజన పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కూడా పీఆర్‌శాఖ పరంగా ఏ మేరకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయనే విషయాన్ని ఆరా తీసినట్టు సమాచారం.