
గుడివాడ: తనను టార్గెట్ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(శనివారం, జూలై 12) వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళుతున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.
ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త, తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోటీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు.
కారును చుట్టుముట్టి..
కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.
గంటకు పైగా ఆమె కారును కదలనీయకుండా నానా బీభత్సం సృష్టించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మహిళా జడ్పీ చైర్‌పర్సన్ పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ రకంగా దాడికి పాల్పడటం ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనడానికి నిదర్శమని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.