మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎన్డీఏ దూరం

Times Now-VMR poll predicts hung House - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 252 స్థానాలు

మెజారిటీ మార్క్‌ అయిన 272కి 20 సీట్లు తక్కువ

యూపీఏకి 147; బీజేపీకి 215, కాంగ్రెస్‌కు 96

కీలకం కానున్న ఇతరులు గెలిచే 144 స్థానాలు

ఏపీలో వైఎస్సార్సీపీ, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ హవా

తేల్చిన ‘టైమ్స్‌నౌ– వీఎంఆర్‌’ సర్వే

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌(ఎన్డీయే) కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలవనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 252, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. జనవరి నెలలో ఆంగ్ల వార్తాచానెల్‌ ‘టెమ్స్‌ నౌ’..  వీఎంఆర్‌ సంస్థతో కలిసి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.

గతంలో ఇండియాటుడే, రిపబ్లిక్‌ చానెళ్లు ప్రకటించిన సర్వేల తరహాలోనే ఈ సర్వే సైతం ‘ఇతరులకు’ కీలక స్థానం కల్పించింది. మొత్తం 543 సీట్లలో మెజారిటీ మార్కు 272కి 20 సీట్ల దూరంలో ఎన్డీయే నిలవడం విశేషం. యూపీఏకు కేవలం 147 సీట్లు రానున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు సాధించిన 144 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్‌కు 96 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 2014లో ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, అందులో మెజారిటీ మార్కు 272ను మించి 282 సీట్లు బీజేపీ గెల్చుకున్నవే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 44 సీట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కొంత పుంజుకున్నా.. సెంచరీ స్థానాలకు కొంత దూరంగానే నిలుస్తుందని సర్వే తేల్చింది.

ఇతరుల్లో..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తమతమ రాష్ట్రాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 32 సీట్లను తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో అత్యధికంగా 23 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటాయంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌), 5 స్థానాలను కాంగ్రెస్, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలుచుకుంటాయంది. ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 21 సీట్లలో 13 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, బీజేడీ 8 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక్కడ 2014లో బీజేడీ 20 సీట్లు గెలుచుకుంది. 2019లో  ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్‌ నౌ– వీఎంఆర్‌ సర్వే పేర్కొంది.

యూపీలో..
కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ 2 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. 2014లో వేర్వేరుగా పోటీ చేసి ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ బోణీ చేయకపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో యూపీలో ఎన్డీయే 73 సీట్లు గెలుచుకుంది.

ఇతర కీలక రాష్ట్రాల్లో..
రాజస్తాన్‌లో బీజేపీ గతంలో మొత్తం 25 సీట్లను గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 17కి తగ్గుతుందని, 8 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2014లో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లను క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ ఈ సారిఅందులోనుంచి రెండు సీట్లను కాంగ్రెస్‌కు కోల్పోనుంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 14 సీట్లు గెలుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్‌ 6 గెలుచుకోనున్నాయి. 2014లో బీజేపీ 27, కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43 (2014 కన్నా ఒక సీటు ఎక్కువ), యూపీఏ 5 గెలుచుకుంటాయి. బిహార్లో(40) గత ఎన్నికల్లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 25 కి పరిమితమవుతుంది. యూపీఏ బలం 15కి పెరుగుతుంది.  

మొత్తం సీట్లు:   543
ఎన్డీఏ:             252
యూపీఏ:        147
ఇతరులు:       144


కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్‌ హవేలీ (1), డామన్‌ డయ్యూ (1), అండమాన్‌ నికోబార్‌ దీవులు (1) లోక్‌సభ స్థానాలను ఎన్డీయే పార్టీలు, అటు చండీగఢ్‌ (1) స్థానాన్ని యూపీఏ గెలుస్తుంది. లక్షద్వీప్‌ (1)లో ఎన్సీపీ, సిక్కింలో ఉన్న ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకుంటారు. పుదుచ్చేరిలోనూ ఒక లోక్‌సభ సీటు ఉన్నప్పటికీ దాని గురించి సర్వే నివేదికలో ప్రస్తావించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top