థర్డ్‌ జెండర్‌ కీలకం | Third Genders Are Very Crucial To This Elections | Sakshi
Sakshi News home page

థర్డ్‌ జెండర్‌ కీలకం

Mar 22 2019 7:30 AM | Updated on Jul 12 2019 6:06 PM

Third Genders Are Very Crucial To This Elections - Sakshi

వివక్ష.. విస్మరణ నుంచి రాజ్యాధికారం దిశగా ట్రాన్స్‌జెండర్లు అడుగులు వేస్తున్నారు. భారత ఎన్నికల్లో థర్డ్‌ జెండర్ల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కేవలం ఓటర్లుగానే కాదు అభ్యర్థులుగానూ పోటీ పడుతున్నారు. భారత ఎన్నికల సంఘం 1994లో ట్రాన్స్‌ జెండర్లను థర్ట్‌ జెండర్లు (ఇతరులు)గా గుర్తించి ఓటు హక్కు కల్పించడంతో వారికి ఎన్నికల్లో ప్రాతినిథ్యం మొదలైంది. అంతకు ముందు ట్రాన్స్‌ జెండర్లను మహిళల కిందనే పరిగణిస్తూ వారి వివరాలను ఓటర్ల జాబితాలో పేర్కొనేవారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2009 నుంచి ఎన్నికల సంఘం థర్ట్‌ జెండర్‌ కాలమ్‌ను ఓటరు లిస్టులో ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య కచ్చితంగా లేదుగానీ.. 3,760 మంది ట్రాన్స్‌ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు.        

జిల్లాల వారీగా ఇలా..
శ్రీకాకుళం జిల్లాలో 247 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ ఓటర్లుగా నమోదయ్యారు. విజయనగరం జిల్లాలో 118 మంది, విశాఖ జిల్లాలో 158 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 384 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 364 మంది ఇతరుల కేటగిరీలో ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్లు నమోదయ్యారు. కృష్ణా జిల్లాలో 294 మంది, గుంటూరు జిల్లాలో 421 మంది, ప్రకాశం జిల్లాలో 149 మంది, నెల్లూరు జిల్లాలో 338 మంది, కడప జిల్లాలో 296 మంది, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 443 మంది, అనంతపురం జిల్లాలో 204 మంది, చిత్తూరు జిల్లాలో 344 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 

రాహుల్‌పై పోటీ
ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలపవచ్చని వీరు భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ట్రాన్స్‌ జెండర్‌ సోనమ్‌ కిన్నర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ప్రాతినిథ్యం వహించిన అమేథి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తమిళనాడులోని మధురై నుంచి శరత్‌కుమార్‌కు చెందిన సముతువ మక్కల్‌ కట్చీ పార్టీ అభ్యర్థిగా ట్రాన్స్‌ జెండర్‌ భారతి, ఆర్కే నగర్‌ నుంచి దేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2017లో ఉత్తరాఖండ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజనీ రావత్‌ రాయపూర్‌ నుంచి, 2012లో ఆయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి గుల్షన్‌ బిందో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిందో 22 వేల ఓట్లు సాధించారు.

తెలంగాణలో ‘చంద్రముఖి’ 
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రముఖి అనే ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారిగా పోటీకి దిగారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గం నుంచి బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ముమ్మర ప్రచారం నిర్వహించారు. ‘తమ్ముడూ!, నీ ఓటు నాకే వెయ్యాలి. మమ్నల్ని మనుషులుగా గుర్తించాలి’ అంటూ ఆమె ఓట్లు అభ్యర్థించింది.

చరిత్ర సృష్టించిన షబ్నం మౌసీ 
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్‌ జెండర్‌గా షబ్నం మౌసీ చరిత్ర సృష్టించారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని సోహగ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో షబ్నం మౌసీ స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ట్రాన్స్‌ జెండర్‌ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2008 ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

తొలి ట్రాన్స్‌ జెండర్‌ మేయర్‌ 
ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు 2015లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌ జెండర్‌ మధు కిన్నార్‌ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను కాదని.. ప్రజలు మధు కిన్నార్‌కే మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి మహవీర్‌ గురుజీ కంటే 4 వేల ఓట్ల మెజారిటీని సాధించిన కిన్నార్‌ దేశంలోని తొలి ట్రాన్స్‌ జెండర్‌ మేయర్‌గా చరిత్ర సృష్టించారు. 

మనుషులమేనని గుర్తించాలి 
మనుషులందరూ చూడటానికి ఒకేలా ఉన్నా భావాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. స్త్రీగా ఉంటే ఎలా ఉంటుందోనని పురుషులు, మగవారిగా ఉంటే ఎలా ఉంటుందోనని మహిళలు అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనలు రావడానికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్స్‌. ఈ హార్మోన్స్‌ విపరీత ప్రభావానికి లోనైనప్పుడు అది వాస్తవ రూపం దాల్చడానికి యత్నించడం సహజం. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకోవడం లేదు. ఏపీలో మేము 51 వేల మంది ఉన్నాం. బాగా చదువుకున్నప్పటికీ అటు ప్రభుత్వాలు, ఇటు ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగాలివ్వడం లేదు. నేను ఇగ్నోలో బీసీఏ పూర్తి చేశాను. నాలా ఎంతోమంది ఉన్నారు. ఉపాధి కోసం రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు మా ఓట్లు కూడా కీలకం కాబట్టి మా గురించి ఆలోచించే వారికే మద్దతు ఇస్తాం.      
– తమన్నా సింహాద్రి, విజయవాడ   
– యసోరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement