కోదండరాం పోటీ లేనట్లే! 

Telangana Elections 2018 Kodandaram Is Not Contesting - Sakshi

జనగామ నుంచి కాంగ్రెస్‌కు చాన్స్‌... ‘సార్‌’కు మొండి చేయి

అభ్యర్థులకు సహకరించాలని కోదండరాంను కోరిన కుంతియా 

తెల్లవారుజాము వరకు చర్చలు జరిపినా టీజేఎస్‌కు దక్కని ప్రయోజనం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా.. అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జనగామను టీజేఎస్‌కు కేటాయించాలని, అక్కడి నుంచి తానే పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం భావించారు. అయితే అనేకసార్లు మంతనాలు, సంప్రదింపుల తరువాత జనగామ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పోటీలో ఉంటారని ప్రకటించారు. దీంతో ఇక కోదండరాం పోటీలో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనగామతోపాటు మరికొన్ని స్థానాలపై స్పష్టత కోసం శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపినా టీజేఎస్‌కు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్యను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. టీజేఎస్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జనగామ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య  తదితరులు కోదండరాంతో మంతనాలు జరిపిన అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడారు. జనగామ నుంచి కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని, లక్ష్మయ్య బరిలో దిగుతారని వెల్లడించారు. పెద్ద మనసుతో కోదండరాం జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. ప్రచారం కోసం ఆయన రాష్ట్రమంతా పర్యటించాలని కోరుతున్నామన్నారు. అనేక మంది నాయకులు, విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. చివరి దశ ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరాం కీలక పాత్ర పోషించారన్నారు. అయితే పోరా>డి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలసి కేసీఆర్‌ పాలనను అంతం చేస్తాయన్నారు.

ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. కూటమికి కన్వీనర్‌గా కోదండరాం, అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందుకు నడిపిస్తారన్నారు. ప్రచారంలో సోనియా, రాహుల్‌ పాల్గొంటారని చెప్పారు. కోదండరాం కూడా తమతో సంయుక్త ప్రచారానికి రావాలని కోరుతున్నామన్నారు. తమ ప్రభుత్వ ఏర్పాటులో అందరికీ అవకాశం కలిపిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విభిన్న భావాలు ఉన్నప్పటికీ కామన్‌ అజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసునని, అది తమకు బాగా లాభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top