నాపై కూడా కేసు పెట్టారు!

Telangana Congress Leaders Meet DGP Mahendar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కోదండరెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనపై కూడా కేసు బనాయించారని ​కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. ‘నాపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానందా, మరికొంతమంది టీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతో కేసు పెట్టారు. సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ నేతలపై వరుస కేసులు..!
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాస్‌పోర్ట్ కేసు, గండ్ర వెంకటరమణపై అక్రమ ఆయుధాల కేసు, కూన శ్రీశైలంగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ హౌసింగ్ కేసు.. ఇలా వరుస కేసులతో కాంగ్రెస్‌ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఉన్న పాత కేసులను తిరగదోడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కై ప్రజాస్వామిక వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ప్రజాస్వామిక పద్ధతిలో అసెంబ్లీ సఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీజీపీని వారు కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top