‘నితీశ్‌.. చివరకు ఆ గతే పడుతుంది’

Tejaswi Yadav slams Nitish on By Poll Decision - Sakshi

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై లాలూ తనయుడు-ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్‌ సెటైర్లతో విరుచుకుపడ్డాడు. బీజేపీకి లొంగిపోయి బిహార్‌ గౌరవాన్ని కేంద్రం కాళ్ల దగ్గర పెట్టారని నితీశ్‌పై మండిపడ్డాడు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు చేశారు.

‘బీజేపీ కనుసన్నలో నితీశ్‌ పాలన నడుస్తోంది. అధికారంలో ఉన్నా జేడీయూ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతోంది. ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కోక్కరుగా జేడీయూను వీడుతున్నారు. త్వరలో ఆ పార్టీ ఖాళీ కావటం ఖాయం. నితీశ్‌ మరోదారి లేక తన పార్టీని బీజేపీతో విలీనం చేసి.. హస్తినలో పాగా వేస్తారు. చివరకు ఏదో ఒక రాష్ట్రానికి ఆయన గవర్నర్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’అంటూ తేజస్వి పేర్కొన్నారు.

కాగా, త్వరలో బిహార్‌లో ఉప ఎన్నికలు(రెండు అసెం‍బ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానానికి) ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సూచనల మేరకు పోటీ చేయొద్దని జేడీయూ నిర్ణయించుకుంది. ఇందులో అరారియా లోక్‌ సభ స్థాన ఎంపీ తస్లీముద్దీన్‌ మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఆయన తనయుడు, ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అలం ముందుగా పోటీ చేయాలని భావించారు. కానీ, జేడీయూ పోటీ నుంచి తప్పుకోవటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆయన ఆర్జేడీలో చేరిపోయారు. ప్రస్తుతం అరారియా నుంచి సర్ఫరాజ్‌ ఆర్జేడీ తరపున పోటీచేయనున్నారు.  ఇక మిగతా రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేయబోమని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయన్‌ సింగ్‌ శనివారం ప్రెస్‌ మీట్‌లో వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top