సీపీఎస్‌ రద్దు చేస్తామన్న వైఎస్‌ జగన్‌

Teachers And Employees Met YS Jagan At PrajaSankalpaYatra - Sakshi

సాక్షి, కురుపాం(విజయనగరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం సీమనాయుడు వలస శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి కలిసి టీటీడీలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు.

పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్‌ రద్దు చేయాలని జననేతకు వినతిపత్రం ఇచ్చారు. వారి సమస్యపై స్పందించిన వైఎస్‌ జగన్‌ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై  ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రకు వారి సంఘీభావాన్ని తెలియజేశారు. అలాగే ఏఎన్‌ఎమ్‌లు కూడా తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

వైఎస్‌ జగన్‌ కలిసిన రేషన్‌ డీలర్లు..
వైఎస్‌ జగన్‌ను కలిసిన రేషన్‌ డీలర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. కమిషన్‌ కాకుండా.. ప్రతి నెలా జీతం వచ్చేలా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీసర్స్‌ అసోషియేషన్‌ సభ్యులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో శిక్షణ ఇచ్చి మెడికల్‌ ప్రాక్టీసుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ హయంలో తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ కలిసిన జీఎం వలస మహిళలు
జననేతను కలిసిన జీఎం వలస మండలానికి చెందిన మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరాజపాడు గ్రామానికి రోడ్డు, స్కూల్‌, మంచినీరు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. పెన్షన్‌ రావడం లేదని మహిళలు వైఎస్‌ జగన్‌ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

మినీ రిజర్వాయర్‌ నిర్మించాలని వినతి..
కొమరడ మండలంలోని 9 పంచాయితీలకు చెందిన రైతులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. గుమ్మిడిగడ్డ మినీ రిజర్వాయర్‌ నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే గుమ్మిడిగడ్డ రిజర్వాయర్‌ ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. ఈ రిజర్వాయర్‌తో 12 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. నీటి వసతి లేకపోవడంతో కూలీ పనుల కోసం రైతులు వలస వెళ్లాల్సి వస్తుందని జననేత దృష్టికి తీసుకవచ్చారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top