జేసీ బంగ్లానే కాజేసి!

TDP MLA DK Satya Prabha Occupied Joint Collector Bangla - Sakshi

చిత్తూరులో విలువైన స్థలాన్నిఆక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ

 రాత్రికి రాత్రే చెట్లు నరికేసి గోడ నిర్మాణం

 నాటుకోళ్ల ఫారం, లాన్, కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే..

చెరువులను కబ్జా చేసిన వాళ్లను చూశాం.. పేదోడి భూమిని కాజేస్తున్న వాళ్లనూ చూస్తున్నాం. ఖాళీగా కనిపిస్తే ప్రభుత్వ స్థలాలనూ దర్జాగా దక్కించుకుంటున్న వాళ్ల గురించీ విన్నాం. వీటికి మించిన విచిత్రం చిత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. వాస్తు దోషాల నివారణ కోసం టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జాయింట్‌ కలెక్టర్‌ బంగ్లా స్థలాన్నే ఆక్రమించేశారు.

విలువ రూ.3 కోట్లు! 
టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ తన ఇంటి వాస్తు సరిగా లేదని పక్కనే ఉన్న దశాబ్దాల చరిత్ర కలిగిన జేసీ బంగ్లాకే ఎసరు పెట్టారు. దాదాపు రూ. 3 కోట్లు విలువ చేసే 7,200 చ.అడుగుల బంగ్లా స్థలాన్ని ఆక్రమించారు. రాత్రికి రాత్రే అందులో గోడ నిర్మించుకున్నారు. దీనికి అడ్డు రావడంతో పురాతన చింత చెట్లను కూడా నరికి వేయించారు. ఆక్రమించిన కొంత భూమిలో నాటు కోళ్ల ఫారం, లాన్, కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. 

వాస్తు దోష నివారణకు.. 
చిత్తూరు సర్వే నెంబర్‌ 311/ఏలో 3.47 ఎకరాల్లో జేసీ బంగ్లా ఉంది. దీని పక్కనే 309/1ఏలో 7,500 చదరపుటడుగులు, 306/2లో 3,500 చదరపుటడుగుల్లో టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ నివాసం ఉంది. ఆమె ఇంటి వాస్తు సరిగా లేదని సిద్ధాంతి చెప్పడంతో దోషాల నివారణ కోసం ఉత్తరం వైపున్న జాయింట్‌ కలెక్టర్‌ బంగ్లా స్థలాన్ని ఆక్రమించుకుని గోడ కట్టేశారు. దీనిపై చర్యలు తీసుకోడానికి అధికారులు ప్రయత్నించినా పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో వెనక్కి తగ్గారు. 

ఆక్రమించిన స్థలంలో ఏర్పాటు చేసుకున్ననాటుకోళ్ల ఫారం, కారు షెడ్డు, లాన్‌  

మీరిస్తానంటే చెప్పండి...! 
ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఎమ్మెల్యే సత్యప్రభ ఆక్రమణలకు పాల్పడటంతో... అప్పటి కలెక్టర్‌ సిద్దార్థజైన్, జేసీ భరత్‌గుప్తా బంగ్లా స్థలం కబ్జాకు గురైనా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు కొందరు సీఎం వద్ద మొరపెట్టుకున్నా... ‘ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాకు ఫండింగ్‌ అవసరం. మీరు ఇస్తానంటే ఆమెపై చర్యలు తీసుకుంటా...!’ అని వ్యాఖ్యానించడంతో సైలెంట్‌గా వెళ్లిపోయినట్లు తెలిసింది. 

చింత దుంగలను ట్రాక్టర్‌లో తరలిస్తున్న దృశ్యం   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top