
ఎమ్మెల్యే కేఏ నాయుడుకు వ్యతిరేకంగా అనేక అంతర్గత సర్వేల రిపోర్టులు తమవద్ద ఉన్నాయని చెప్పిన టీడీపీ..
సాక్షి, విజయనగరం : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన గళాలు వినిపిస్తుండగా.. అవినీతి ఆరోపణలున్న నేతలకు టికెట్ ఇస్తే సహించేది లేదని పార్టీ నేతలు తెగేసి చెప్తున్నారు. టీడీపీ తొలి జాబితాలో గజపతి నగరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి కేటాయించడంపై అసమ్మతి వెల్లువెత్తుతోంది. అవినీతి ఆరోపణలు, అధికారులపై వేధింపులు వంటి అంశాల్లో అపప్రద మూటగట్టుకున్న అప్పలనాయుడుకి సీటిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కేఏ నాయుడుకు వ్యతిరేకంగా అనేక అంతర్గత సర్వేల రిపోర్టులు తమవద్ద ఉన్నాయని చెప్పిన టీడీపీ మరలా ఆయనకే అవకాశం ఇచ్చిందని మండిపడ్డారు. కేఏ నాయుడును బరిలోకి దించి పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొండలరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రేపటి (ఆదివారం) ముఖ్యమంత్రి పర్యటనలో గజపతినగరం అభ్యర్థిని మార్చే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.