‘వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారం’

Tammineni Sitaram takes on Yellow Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిత్యం ప్రజల మధ్యన ఉంటూ విశేష ప్రజాదరణ పొందుతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జగన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఎల్లోమీడియా ఓర్వలేకపోతోందని దుయ్యబట్టింది. భారతి సిమెంట్స్ లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో చేర్చడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. భారతి సిమెంట్స్ పెట్టుబడుల విషయంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ భారతిరెడ్డి పేరును చార్జిషీట్ లో చేర్చడమంటే దురుద్దేశపూర్వకంగా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డిపై అనేక కేసులు దాఖలుకాగా ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన భార్య భారతీ రెడ్డి పేరు చార్జిషీటులో చేర్చాల్సిన అవసరమేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి చట్టబద్దం కానిది ఏముందో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెప్పాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడేళ్ల తర్వాత వైఎస్‌ భారతి పేరును చార్జిషీట్‌లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్‌లో చేర్చడంలోని ఆంతర్యమేంటి? అని తమ్మినేని ప్రశ్నించారు. భారతీ సిమెంట్స్‌ మెజారిటీ వాటాను ఫ్రాన్స్‌ కంపెనీ వికా కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. చార్జిషీట్‌లో తన పేరును పెట్టిన విషయం భారతీరెడ్డికన్నా ముందుగా ఎల్లో మీడియాకు ఎలా లీకైంది? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లో పనిచేస్తున్న ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులతో టీడీపీకి సంబంధాలున్నాయన్న విషయంపై గతంలోనే ఫిర్యాదు చేశామని, ఆ అధికారులే ఇటు టీడీపీకి లీకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు అంతా సక్రమంగానే జరిగాయని స్పష్టం చేస్తూ ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉందని, చంద్రబాబు శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పిన విషయాన్ని తమ్మినేని ఇక్కడ ప్రస్తావించారు. ఓటకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చంద్రబాబుపైన చర్యలు తీసుకోలేదని, ఇన్నేళ్లయినా ఆ కేసు ముందుకు సాగకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డిపై ఇలా ఎన్ని తప్పుడు కేసులు బనాయించినప్పటికీ ఆయన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని, తప్పుడు ప్రచారం సాగిస్తున్న వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు.

దిగజారుడు రాజకీయాలు 
ఈ తరహా అక్రమ కేసుల్లో తన కుటుంబ సభ్యులను కూడా వదలకపోవడంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా భార్య పేరును నిందితురాలిగా ఈడీ చేర్చిందంటూ, ఓ వర్గం మీడియాల్లో వస్తున్న రిపోర్టులు చూసి విస్మయం చెందా. ఇంత దిగజారుడు రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది, చివరికి కుటుంబసభ్యులను కూడా వదలడం లేదు' అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top