అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి పరుగు

Tamil Nadu State Congress President KS Alagiri Met Sonia Gandhi - Sakshi

ఢిల్లీకి పరుగు 

డీఎంకేతో బంధం గట్టిదేనని వ్యాఖ్య

సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల నేపథ్యంలో డీఎంకేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వర్గాలు వ్యతిరేకించిన తీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరిని ఇరకాటంలో పెట్టింది. అదే సమయంలో డీఎంకేను ఉద్దేశించి ఆయన సైతం చేసిన వ్యాఖ్యలు కూటమికి ఎసరుపెట్టే పరిస్థితులకు దారి తీశాయి. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్‌ దేశ రాజధాని ఢిల్లీకి పరుగులు తీశారు. తమ నేత సోనియాగాందీతో కేఎస్‌ భేటీ సాగింది. ఈ సమయంలో కేఎస్‌ సోనియా క్లాస్‌ పీకినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జిల్లా, యూనియన్‌ పంచాయతీల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ వర్గాలు అనేక చోట్ల డీఎంకేకు షాక్‌ ఇచ్చే దిశగా ముందుకు సాగిన విషయం తెలిసిందే. దీంతో తమకు అవకాశాలు ఉన్నా, చివరకు  ఆయా జిల్లా, యూనియన్‌ పదవుల్ని డీఎంకే కోల్పోవాల్సిన పరిస్థితి. (నా పరిస్థితి బాగోలేదు.. ఇలాగైతే దిగిపోతా: సీఎం)

అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి విడుదల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారి తీసింది. కూటమి ధర్మాన్ని డీఎంకే ధిక్కరించినట్టుగా పరోక్షంగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌పై కేఎస్‌ ఎదురుదాడి వ్యాఖ్యల తూటాలు పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో డీఎంకే కటీఫ్‌ తథ్యం అన్న చర్చ జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఈనెల 21న కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు స్టాలిన్‌ సిద్ధమయ్యారు. అదే సమయంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీల సమావేశాన్ని సైతం డీఎంకే బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమయంలో డీఎంకే సీనియర్‌ నేత, ఎంపీ టీఆర్‌ బాలు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ అధిష్టానం ఇరకాటంలో పడ్డట్టు అయింది.   (అశాంతి సృష్టిస్తున్నారు: మోదీ)

ఢిల్లీకి పరుగు.. 
కేఎస్‌ అళగిరి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ వర్గాలు తీవ్రంగానే పరిగణించి ఉన్నాయని టీఆర్‌ బాలు చేసిన వ్యాఖ్యలతో ఇక కూటమి అన్నది కొనసాగేనా అన్న చర్చ జోరందుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ డీఎంకే పాత్ర కీలంగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం కాంగ్రెస్‌ పెద్దల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్‌ ఆగమేఘాలపై పరుగులు తీశారు. ఉదయాన్నే పార్టీ నేత సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు.

గంటన్నరకు పైగా సోనియాతో భేటీ సాగడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, అళగిరి తన తరఫు వివరణను సోనియాగాందీకి ఇచ్చుకున్నా, డీఎంకేతో వైర్యం మంచి కాదని క్లాస్‌ పీకినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగిన వ్యవహారాలను సోనియా తీవ్రంగా పరిగణించి, డీఎంకే నిర్ణయాలకు తగ్గట్టుగా ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన కేఎస్‌ మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నకు దాట వేత ధోరణి అనుసరించారు. డీఎంకే – కాంగ్రెస్‌ల బంధం గట్టిదని , తమ కూటమిలో ఎలాంటి వివాదాలు, చీలికలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు, వివాదాలు తప్పవని, తన తరఫున ఉన్న వివరణను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లినట్టు ముగించారు. కాగా, టీఆర్‌ బాలును మీడియా కదిలించగా, కేఎస్‌ ప్రకటన డీఎంకే వర్గాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన మాట వాస్తవమేనని, కార్యదర్శులతో స్టాలిన్‌ భేటీ కానున్నారని ముగించడం గమనార్హం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top