సుష్మా స్వరాజ్‌ ఒంటరి పోరాటం

Sushma Swaraj Endless Fighting On Trolling - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ హిందూ–ముస్లిం జంట పట్ల సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోషల్‌ మీడియా గత వారం రోజులుగా నానా దుర్భాషలాడుతున్నా ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగానీ, అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకుగానీ, ఆ పార్టీలో ఏ ఒక్కరైనాగానీ, ఆఖరికి సుష్మా స్వరాజ్‌ సహచర మహిళా మంత్రులుగానీ స్పందించకపోవడం విస్మయం, విభ్రాంతికరం. నడి రోడ్డుమీదనా, నలుగుట్లోనా లేదా సోషల్‌ మీడియాలోనా, మరో మీడియాలోనా అన్నది కాదిక్కడ, ఓ మహిళకు, అందులోనూ కేంద్రంలోనే మంత్రిగా ఉన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా లజ్జా విహీనమే కాకుండా హింసాపూర్వక హెచ్చరికలు చేస్తుంటే ప్రమాదరకరమైన అంశమా, కాదా! నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినాయకుడు ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు సుష్మా స్వరాజ్‌కు అండగా వచ్చారే! మరి అధికార పక్షానికి ఏమైందీ?

భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతం కలిగిన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓ హిందూ–ముస్లిం జంటకు పాస్‌పోర్టు ఇప్పించడం, ఆ జంటను వేధించిన పాస్‌పోర్ట్‌ అధికారిని బదిలీ చేయడం సుష్మా స్వరాజ్‌ చేసిన తప్పా! శరపరంపర ట్వీట్లతో ఆమెను అంతగా వేధిస్తున్నారెందుకు? పైగా తాము బీజేపీ మద్దతుదారులమని, హిందూత్వ మద్దతుదారులమని చెప్పుకుంటూ అసభ్య, అనుచిత దుర్భాషలకు దిగడం ఎంతటి దిగజారుడుతనానిని నిదర్శనం. ‘నీవు ఓ ముస్లిం కిడ్నీని అమర్చుకోవడం వల్లనే ఇలా వ్యవహరిస్తున్నావా?... ఇప్పటి నుంచి నిన్ను సుష్మా బేగం అని పిలవడమే సముచితం’ లాంటి వ్యాఖ్యానాలే కాకుండా, ‘ముస్లింలను మెప్పించేందుకు ప్రయత్నించిన సుష్మాను లాగి లెంపకాయ కొట్టలేకపోయారా?’ అంటూ ఆమె భర్తను ఉద్దేశించి వచ్చిన ట్వీట్లను ఎలా ట్రీట్‌ చేయాలి! కొట్టలేక పోయారా ? అన్న ట్వీట్‌కు తాను, తన కుటుంబం తట్టుకోలేని బాధకు గురయ్యామని సుష్మా భర్త స్పందించడం ఇక్కడ గమనార్హం.

సోషల్‌ మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న దూషణలకు పార్టీ నుంచిగానీ, ప్రభుత్వం నుంచి గానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా సుష్మా స్వరాజ్‌ మాత్రం చాలా హుందాగా స్పందిస్తూ వచ్చారు. ఆమె హృదయంలో పాకిస్థాన్‌ జెండా ఉన్నట్లు చిత్రీకరించిన ట్వీట్‌తో సహా పలు ట్వీట్లకు ఆమె లైక్‌ కొట్టారు. మిగతా లైంగికమైన, హింసాత్మక ట్వీట్ల విషయంలో ‘మీరు వీటిని అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా?’ చెప్పండంటూ సోషల్‌ మీడియాను ప్రశ్నించారు. 43 శాతం మంది అంగీకరిస్తామంటూ, 57 శాతం వ్యతిరేకిస్తామంటూ స్పందించారు. ఈ ఓటింగ్‌ వివరాలను కూడా సుష్మానే స్వయంగా మరో ట్వీట్‌ ద్వారా జూన్‌ 30న తెలియజేశారు. అదే రోజు సోషల్‌ మీడియా దినోత్సవం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లతో స్పందించారు. సుష్మాకు జరుగుతున్న అవమానం గురించి ఒక్క ట్వీట్‌ కూడా చేయలేక పోయారు.
 
‘సోషల్‌ మీడియా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన విధులను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో ఈ మీడియా కీలక పాత్ర వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, తమ సృజనాత్మక శక్తిని ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో తోడ్పడుతోంది’ అంటూ తొలుత ట్వీట్‌ చేసిన మోదీ, ఆ తర్వాత మరో ట్వీట్‌లో ‘సోషల్‌ మీడియాను వినూత్నంగా ఉపయోగించుకుంటున్న నా యువ మిత్రులకు ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఏ మాత్రం నిర్మొహమాటం లేకుండా మీరు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా తీరు నన్ను మరింతగా ఆకర్శిస్తోంది. ఓ యువకులారా! ఇదే విధంగా మీ అభిప్రాయాలను వెల్లడించండి, స్వేచ్ఛగా చర్చించండి’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను చూస్తుంటే సుష్మాపై సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను ఆయన సంపూర్ణంగా సమర్థిస్తున్నట్లు ఉంది. అదే నిజమైతే ఆయన అటు సుష్మాను మందలించాలి. అండుకు ఇటు మనం సిగ్గుపడాలి. సోషల్‌ మీడియా ముందు ఒంటిరిగా నిలబడి పోరాడుతున్న సుష్మా స్వరాజ్, ఇక తన వెంట ఎవరు రారన్న విషయం గ్రహించారేమో! ‘ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండడం అత్యంత సహజం. విమర్శించండి, దుర్భాషలొద్దు. సముచిత భాషలో చేసిన విమర్శలకే ఎప్పుడూ ఎక్కువ బలం ఉంటుంది’ అంటూ జూలై ఒకటిన సుష్మా మరో ట్వీట్‌ చేశారు. ఇక తేల్చుకోవాల్సింది సోషల్‌ మీడియానే!
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top