మిస్డ్‌కాల్‌ సభ్యత్వాలకే సంబరాలా?

Srinivas Goud fires on BJP - Sakshi

బీజేపీపై మండిపడ్డ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ‘బీజేపీ రాష్ట్ర నేతలు మిస్డ్‌కాల్‌ సభ్యత్వాలు చూసి సంబరపడుతున్నారు. మేం తలుచుకుంటే గంటలో మూడు కోట్ల సభ్యత్వాలు సాధించగలం. మేము చేసినవన్నీ క్రియాశీల సభ్యత్వాలు’అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మందిరాల పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలు.. దేశంలో ఏదైనా గుడికోసం రూ.100 కోట్లు కేటాయించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తుందన్నారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని, ప్రజలను విడదీసే రాజకీయాలు, సెంటిమెంట్లకు దక్షిణ భారతదేశంలో.. ప్రత్యేకించి తెలంగాణలో ఎంత మాత్రం స్థానం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కనీసం పదో వంతైనా తమ రాష్ట్రంలో సాధిస్తే చాలనే అభిప్రాయంతో పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అధికారులు, అనధికారులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాత్రం ఆ పార్టీకే చెందిన కేంద్ర నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై గతంలో చేసిన వ్యాఖ్యలను మరిచిపోయి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’కార్యక్రమంలో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రశంసించారని, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని నీతి ఆయోగ్‌ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.   

అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు..
కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుండగా, బీజేపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖకు మంత్రి లేరని, రాష్ట్ర బడ్జెట్‌లకు బీసీలకు కేటాయించిన నిధులతో పోలిస్తే.. కేంద్రంలో నామమాత్రంగా కేటాయింపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top