ప్రియమా.. అప్రియమా?

Special story on priyanka gandhi political entry - Sakshi

సోనియా తనయ చరిష్మా కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?

రాజకీయ వారసత్వంతో పార్టీకి ఓట్లు కురిపించగలరా?

ప్రియాంక సమర్థతకు అగ్నిపరీక్షగా సార్వత్రిక ఎన్నికలు  

చూడగానే అచ్చం నాయనమ్మను గుర్తు చేసే రూపం.. దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన రాజకీయ కుటుంబం నుంచి అందిన వారసత్వం ఒకవైపు.. ముంచుకొస్తున్న సార్వత్రిక సమరంలో సోదరుడికి ‘చే’దోడుగా నిలవాల్సిన సమయం.. కేంద్రంలో అధికారానికి దగ్గరి దారిగా భావించే యూపీలో పార్టీకి పూర్వవైభవం తేవాలన్న లక్ష్యం మరోవైపు... ఇవీ సోనియా గాంధీ తనయ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా ముందున్న పరిస్థితులు..  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆమె రాకతో ‘హస్తిన’ తిరిగి కాంగ్రెస్‌ వశమవుతుందా? 

మొదటి రోజే ప్రియాంక ‘సాహసం’..
‘రాజకీయాలకు కొత్తయినా, అనుభవం లేకున్నా పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తా’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ సిద్ధాంతాలు, ఆలోచనా విధానా లను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. తన భర్త రాబర్ట్‌ వాద్రా రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలపై మొదట ఆరోపణలు వచ్చిన రోజుల్లో ఆయన ‘ప్రైవేట్‌ వ్యక్తి’ అని, ఆయన లావాదేవీలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిం ది. ప్రియాంక ఆ విషయాలపై మౌనం పాటించారు. ప్రియాంకకు రాజకీయ పాత్ర లభించడంతో కాంగ్రెస్‌ తోపాటు ఆమె కూడా భర్త రాబర్ట్‌ను సమర్థిస్తూ మా ట్లాడుతున్నారు. తన భర్తను తొలిసారి ఈడీ ఆఫీసు వరకు కారులో దింపి ఏఐసీసీ ఆఫీసుకు వెళ్లడం సంచ లనం సృష్టించింది. వాద్రాపై ఆరోపణల గురించి అ డిగినప్పుడు ఆమె ఏమాత్రం తొణక కుండా జవాబి చ్చారు. వాద్రా అవినీతి ఆరోపణలు తనకు రాజకీ యంగా ఇబ్బందికరం కాదనే విష యా న్ని ఆమె ఇ లా స్పష్టం చేశారు. దేశంలో మారిన పరిస్థితుల్లో ‘కళంకితుడైన’ భర్తకు బాసటగా నిలవడం వల్ల ప్రియాంకకు వచ్చే నష్టమేమిటో కాలమే చెప్పనుంది.

‘వేధింపులు’ నిజమని జనం నమ్మితే లాభమే!
‘దేశానికి సేవ చేయాలనుకుంటుంటే బీజేపీ సర్కారు నా కుటుంబాన్ని వేధిస్తోంది’ అని ఎన్నికల సభల్లో ప్రియాంక చేయబోయే ప్రచారాన్ని జనం నమ్మితే కాంగ్రెస్‌కు లాభమే. పార్టీకి పార్లమెంటు సీట్లు పెరుగుతాయి. తనను వేధిస్తున్నారని ప్రజలకు చెప్పి నమ్మించే జనాకర్షణ శక్తి ఉన్న నాయకురాలిగా ప్రియాంక అవతరిస్తారు. 2014 పార్లమెంటు ఎన్నికల ముందు నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, అంతకు ముందు ఆయనపై అనేక రకాల దర్యాప్తులు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం చేయించింది. ఆయన కులాన్ని పరోక్షంగా సూచించే విధంగా గులాం నబీ ఆజాద్‌ వంటి నేతలు తొందరపడి మాట్లాడారు. తర్వాత వారు తమ వ్యాఖ్యలపై విచారం ప్రకటించినా, మోదీ తనను కాంగ్రెస్‌ వేధిస్తోందని, కించపరుస్తోందని విజయవంతంగా ప్రచారం చేసుకున్నారు. ప్రజల్ని తన మాటలతో ఆయన నమ్మించగలిగారు. ప్రియాంక కూడా మోదీ మార్గంలోనే ప్రయాణించి రాజకీయంగా ఎంత వరకు లబ్ధి పొందుతారో చూడాల్సి ఉంది.

రాబర్ట్‌ అక్రమాలే  బీజేపీకి అస్త్రాలైతే?
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగా యంటూ రాహుల్‌ గాంధీ బీజేపీపై సాగిస్తున్న పోరులో అవినీతినే ప్రధానాస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రా కంపె నీల విషయంలో వచ్చిన అక్రమ లావాదేవీల ఆరోపణలపై జరుగు తున్న విచారణ అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయడానికి ఎప్పటి నుంచో సిద్ధమవుతోంది. కానీ ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి దిగడంతో కాషాయ శిబిరం ఆరోపణలకు ఆమె దీటైన జవాబిస్తారని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. ప్రియాంక నాయనమ్మ ఇందిరా గాంధీ ప్రధాని అయిన కొత్తలో మంచి వక్త కాదు. అందుకే ఆమెను ప్రతిపక్షాలు ‘గూంగీ గుడియా’ (మూగ బొమ్మ’) అని పిలిచినట్టు ప్రియాంకను వర్ణించే అవకాశం లేదు. ప్రతిపక్షంలో కాంగ్రెస్‌ ఉండటం, ప్రధాని పదవి నిర్వహించిన తన కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలతోపాటు సోదరుడు రాహుల్‌ను ‘నామ్‌దార్‌’ (వారసుడు) అంటూ ప్రధాని మోదీ పదేపదే తిట్టిపోస్తున్న కారణంగా ప్రియాంక దూకుడు పెంచి బీజేపీకి గట్టి జవాబు ఇస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యూపీలో బక్కచిక్కిపోయిన కాంగ్రెస్‌కు ప్రియాంక ఏ మేరకు జీవం పోస్తారనే అంశంపై యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు లభించే పాత్ర ఆధారపడి ఉంటుంది. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ప్రియాంక స్థానాన్ని తూర్పు యూపీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి. గాంధీ కుటుంబానికి చెందిన కొత్త నేతగా ఆమెకు సహజంగానే కొన్ని అనుకూల అంశాలున్నా కాలక్రమంలో అవి నిలబడవని, ఈ కుటుంబాన్ని మొదటి నుంచీ వ్యతిరేకించేవారు ప్రియాంకను కూడా వ్యతిరేకిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రియాంకలా హఠాత్తుగా రాజకీయ రంగంపైకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయడం నేడు కుదరని పని అని, దేశం మారిపోయిందని మార్కెట్‌ విశ్లేషకుడు రుచిర్‌ శర్మ వ్యాఖ్యానించారు. 

ఇప్పుడే అద్భుతాలు ఆశించట్లేదన్న రాహుల్‌...
ప్రియాంక(పార్టీ తూర్పు యూపీ ఇన్‌చార్జి), జ్యోతిరాదిత్య సింధియా (పశ్చిమ యూపీ ఇన్‌చార్జి) వల్ల 2 నెలల్లో ఏవో అద్భుతాలు జరుగుతాయని తాను ఆశించడం లేదని రాహుల్‌ గాంధీ ప్రత్యక్షంగానే అంగీ కరించారు. ముఖ్యంగా ప్రియాంక ప్రవేశంతో లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ బలం గణనీయంగా పెరుగుతుందనే భ్రమల్లేవని చెప్పుకొచ్చారు. కానీ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఇద్దరు నేతలూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నిర్మాణాత్మక రూపం ఇవ్వాలని మాత్రం ఆయన కోరుకుంటున్నారు. ప్రియాం కకు పార్టీ పదవి ఇస్తున్నట్లు రాహుల్‌ ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఆమెకు మితిమీరిన ప్రచారం వచ్చింది. దీంతో నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యు రాలి రాజకీయ రంగప్రవేశంపై పాలకపక్షమైన బీజేపీ అతిగా స్పందించింది. రాజకీయాలంటే అందాల పోటీ కాదని కొందరు వ్యాఖ్యానించగా మరికొందరేమో రాహుల్, ప్రియాంకలను రావణ, శూర్పణకలుగా అభివర్ణించారు. పైగా ఆమె రాక... రాహుల్‌ వైఫల్యాన్ని అంగీ కరించడమేనని ఎద్దేవా చేశారు. అయితే ఇది  కమలదళం కలవర పాటును తెలియజేస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top