అసలు బాలయ్యకు ఏమైంది..! | specail story on balakrishna | Sakshi
Sakshi News home page

అసలు బాలయ్యకు ఏమైంది..!

Oct 5 2017 1:44 PM | Updated on Aug 29 2018 1:59 PM

specail story on balakrishna - Sakshi

  • సాక్షి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం..!

నూటొక్క సినిమాల హీరో.. తెలుగువారి అభిమాన నటుడు అన్నగారి కొడుకు. ఆంధ్రప్రదేశ్‌ ఆసెంబ్లీలో సభ్యుడు.. ఒక నియోజక వర్గానికి ఎమ్మెల్యే. కానీ.. ఒక్కోసారి అతని ప్రవర్తన చూస్తే, మాటలు వింటే ఈ హోదాలన్నీ సిగ్గుపడతాయి. సాటి మనుషుల పట్ల, సొంత అభిమానుల పట్ల అతను స్పందించే తీరు అత్యంత అవమానకరంగా ఉంటోంది. ఎందుకు కొడతారో తెలియదు, వేలమంది మధ్యలో మైక్‌ పట్టుకుని ఏం మాట్లాడతారో తెలియదు. నిత్యం తన ఉపన్యాసాల్లో రామాయణం, మహాభారతాలను ప్రస్తావించే ఈ హీరోగారు.. తనదాకా వచ్చేసరికి జీరో అయిపోతున్నారా? అసలు బాలయ్యకు ఏమైంది?


సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ మరోసారి కోపమొచ్చింది. అభిమాని చెంప చెల్లుమనిపించారు. తన కంటే ముందుకెళ్తున్నాడన్న అసహనంతో  చేయి చేసుకున్నాడు. దీంతో అభిమాని షాక్‌కు గురయ్యాడు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

నిజానికి అభిమానులను  కొట్టడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అభిమానంతో  వచ్చి చాలా మంది ఫ్యాన్స్‌ బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల విజయవాడలో సెల్ఫీ కోసం ఎగబడ్డాడంటూ.. అభిమాని చేతిలోని ఫోన్‌ను విసిరికొట్టారు బాలకృష్ణ. హిందూపురంలో ఈ మధ్య ఓ అభిమాని చెంపు చెల్లుమనిపించాడు బాలయ్య. అభిమానంతో మీదకొచ్చాడంటూ చెంపపై కొట్టాడు. అభిమాన హీరో తీరుతో..  ఆ ఫ్యాన్‌ నివ్వెరపోయాడు.  

ఫ్యాన్స్‌నే కాదు...తనకు అనునిత్యం సహకరించే  అసిస్టెంట్‌పై కూడా బాలయ్య తన రౌద్రరూపం ప్రదర్శించాడు. షూటింగ్‌ సమయంలో  బూట్లు సరిగా  తుడవలేదంటూ అసిస్టెంట్‌ని కొట్టాడు. అప్పట్లో ఈ వార్త  కూడా సోషల్‌మీడియాలో బాగా హల్‌చల్ చేసింది.

సమీపంలో అభిమాన హీరో షూటింగ్‌  జరుగుతుందని తెలుసుకుని వెళ్లిన  ఫ్యాన్‌కు .. .బాలయ్య నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వీడు మనోడా కాదా అంటూ నేరుగా ప్రశ్నించి... కాదని తెలిసే సరికీ గెట్‌ అవుట్ అన్నాడు. ఏంటిరా అలా చూస్తున్నావంటూ వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు...ఇటీవల  వెనక నుంచి ఎవరో నెట్టారంటూ బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బండ బూతులు తిట్టేంత పని చేశారు. ఆ సమయంలో బాలకృష్ణను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ విజ్‌వల్‌లో బాలయ్య ముఖకవళికలు చూస్తే ....ప్రతిఒక్కరికీ అర్ధమైపోతుంది.

తాను నటించిన గౌతిమిపుత్ర శాతకర్ణి చిత్ర ట్రైలర్ లాంచ్‌ సమయంలోనూ..... బాలయ్య సహనాన్ని కోల్పోయారు. ఫోటో దిగేందుకు వస్తున్నాడంటూ ఓ అభిమానిపై  చిర్రుబుర్రులాడారు.

ఫ్యాన్స్‌పై సమయమొచ్చినప్పుడుల్లా బాలయ్య రౌద్రరూపం చూపిస్తుండగా...కొందరు మాత్రం ఆయన్ను వెనుకేసుకొచ్చే పనిలో పడుతున్నారు. బాలయ్య అభిమానంతోనే కొడతారని.. ఫ్యాన్స్‌కు అది ఆశీర్వదమంటూ కొత్త భాష్యం చెప్పుకొస్తున్నారు. ఈ మధ్య జరిగిన పైసా వసూల్ చిత్ర వేడుకలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఇదే చెప్పాడు. ఇక, బాలయ్య బాదుడికి టీడీపీ నేతలు కొత్త అర్థం చెబుతున్నారు. ఆయన కొడితే అభిమానులు ఉప్పొంగిపోతారని చెప్పుకొస్తున్నారు. ఆయన చేయి తగలడం కోసం ఎదురుచూస్తారని అంటున్నారు. బాలయ్య ఎంత పెద్ద నటుడైనా.....గొప్ప రాజకీయ నాయకుడు కుమారుడైనా ....ఇలా సందు దొరికినప్పుడల్లా ఆగ్రహం పేరుతో ఫ్యాన్స్‌పై చేయి చేసుకోవడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని బాలయ్య ఎప్పుడు తెలుసుకుంటారో...వేచి చూడాలి.

ఈ చర్చా కార్యక్రమం పూర్తి వీడియో ఇక్కడ చూడండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement